Sep 19,2023 17:47

ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై విజయవాడలో వినాయకుని గుడి నుండి కనకదుర్గ గుడి వద్దకు ప్రదర్శన చేయకుండా అడ్డుకోవడం, రాష్ట్రవ్యాపితంగా వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులను గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కాలినడకన వెళ్ళి నిరసన తెలిపే హక్కును కూడా నిరాకరించడం, అరెస్టులు చేయడం పౌరహక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని అణచివేయడం అప్రజాస్వామికమని తెలిపింది. ఈ తరహా నిరంకుశ పద్దతులకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది.