Oct 01,2023 15:33

ప్రజాశక్తి-విజయవాడ : మెడికల్‌ డేటాకు భద్రత కల్పించాలని సిఎం జగన్ కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు లేఖ రాశారు. 
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అవసరమైన మందులు సరఫరా చేయాలని కోరారు..వైద్యుల్ని, సిబ్బందిని సమకూర్చాలని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్ని ఆధునీకరించి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ కార్యక్రమం ప్రచారార్భాటంగా మిగిలిపోతుందని తెలిపారు. 
    ప్రజల నుండి సేకరించే డేటాకు చాలా ప్రాధాన్యత ఉన్నదని వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వం సేకరించిన డేటా ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల చేతికి పోయిన విషయం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. పౌరుల ప్రైవసీ దెబ్బ తినడమే కాకుండా డేటాను అమ్ముకుని కంపెనీలు కూడా లాభపడుతున్నాయని వెల్లడించారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆరోగ్య డేటాకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆరోగ్యసేతుకు అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. అది అక్కడ నుండి ప్రైవేటు ఇన్సూరెన్సు, ఫార్మా కంపెనీలకు చేరే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కేంద్రం నుండి డేటా భద్రతకు హామీ లేకుండా ఈ సమాచారాన్ని అనుసంధానం చేయకూడదని డిమాండ్ చేసారు.  రాష్ట్రంలో కూడా ఈ సమాచారం బయట వ్యక్తులకు, ప్రైవేటు కంపెనీలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకోసం డేటా భద్రత చట్టాన్ని తీసుకురావాలని కోరారు.