Jul 14,2021 20:59

న్యూఢిల్లీ : దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంఘటనలతో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హోం శాఖ నోటీసులు జారీ చేసింది. కోవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో అధికారుల్ని వ్యక్తిగతంగా బాధ్యత వహించేలా చూడాలని కోరింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజా రవాణా, హిల్‌ స్టేషన్ల వద్ద నిబంధనలు ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నాయని గమనించినట్లు హోం శాఖ తెలిపింది. హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఈ లేఖ రాసారు. రద్దీ ప్రదేశాలు వైరస్‌ వ్యాప్తికి హట్‌స్పాట్స్‌గా మారకుండా చూడాలని, రెండో దశ ఇంకా ముగియనందున అలసత్వం వద్దని లేఖలో తెలిపారు. భవిష్యత్‌లో వైరస్‌ విజృంభించకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్‌ కొరత లేదు
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరతలేదని కేంద్ర నూతన ఆరోగ్య మంత్రి మన్షుక్‌ మాండవియా స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ కొరతపై రాష్ట్రా ప్రభుత్వాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. 'ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ కోసం జూన్‌ నెలలో 11.46 కోట్ల డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేశాం' అని మంత్రి బుధవారం ట్వీట్‌ చేశారు. 'జూలైలో ఈ పంపిణీని 13.50 కోట్ల డోసులకు పెంచుతాం' అని మంత్రి మరోక ట్వీట్‌ చేశారు. జిల్లా స్థాయిలో ప్రణాళికల ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్‌ జరగాలని మంత్రి తెలిపారు.
కాగా, వివిధ రాష్ట్రాల కార్యదర్శులు, సీనియర్‌ అధికారులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీరం, భారత బయోటెక్‌ ప్రతినిధులు కూడా పాల్గన్నారు. ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో నెమ్మదిగా వ్యాక్సినేషన్‌ జరుగుతుండటంపై భూషణ్‌ అందోళన వ్యక్తం చేశారు.