Oct 07,2023 08:26

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ది, సామాజిక, ఆర్ధిక పురోగతిని సాధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు శుక్రవారం జరిగింది .ఈ సందర్భంగా సిఎంమాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన బహుముఖ కార్యక్రమాలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలు, స్దానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి అంశాలతో ఈ కార్యక్రమాలు ఉన్నట్లు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు నేడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకే పరిమితమయ్యాయన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా మావోయిస్టుల బలం 2019నుంచి 2023 నాటికి 150 నుంచి 50కి తగ్గిందన్నారు. రాష్ట్ర సరిహద్దులను ఒడిశా, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లతో పంచుకుంటున్నామని, నాలుగు రాష్ట్రాల అధికారులతో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. సమాచారాన్ని ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ ఎప్పటికప్పుడు పంచుకుంటూ సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆఫరేషన్‌ పరివర్తనలో భాగంగా 2020 -21 నుంచి రాష్ట్ర పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని, 224 కేసులు నమోదు చేసి 141మందిని అరెస్టు చేశారన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనులను కాఫీ, నిమ్మ,జీడి, మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్‌ఓక్‌తోపాటు రాజ్మా, కందిపప్పు, వేరుశెనగ వంటి పంటల సాగుకు ప్రోత్సహిస్తూ జీవనోపాది కల్పిస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1,087 కిలో మీటర్ల రహదారి నిర్మాణం పూర్తి చేశామన్నారు.

  • అమిత్‌షాతో సిఎం భేటీ

ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షాతో సిఎం జగన్‌ గంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, విభజన చట్టంలోని అంశాలు, తదితర అంశాలపై అమిత్‌షాకు సిఎం వివరించినట్లు సమాచారం.

  • పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల చేయండి

పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలని అమిత్‌షాకు సిఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతానికి నిధులు విడుదలచేయాలంటూ గతంలో పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని తెలిపారు. లైడార్‌ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని చెప్పారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17, 144.06 కోట్లు అవసరమవుతాయని, ఆమేరకు నిధులు విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయంబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.