ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈ నెల 22, 23వ తేదీలలో రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఆర్ఆర్ కళ్యాణమండపం నందు చేపట్టే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అన్నమయ్య జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్ పేర్కొన్నారు. ఆర్ అండ్ బి కార్యాలయం వద్ద శనివారం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిట్వేలే రవికుమార్ మాట్లాడుతూ ఐక్యత, పోరాటం నినాదాలతో 1970వ సంవత్సరంలో సీఐటీయూ ఆవిర్భవించి నిత్యం కార్మిక, ఉద్యోగుల సమస్యల పైన నిరంతర పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించిందని అన్నారు. సిఐటియు ఆవిర్భవించినప్పటి నుంచి దేశ సమైక్యత, సమగ్రతల కోసం దోపిడీ లేని వ్యవస్థ కోసం నిత్యం కార్మికులను చైతన్యవంతులను చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాల ముసుగులో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. 72 రకాల జీవోల కాలపరిమితి ముగిసినా సవరించలేదని, కనీస వేతనాలు పెంచలేదని.. తదితర అంశాల పైన, హక్కుల సాధన కోసం రాయచోటిలో జరిగే జిల్లా మహాసభలలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎం.ఏ గఫూర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బాలకాశి, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె.సుబ్బరావమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే.ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై కార్మిక సమస్యలను చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభల జయప్రదానికి ఆర్థిక, ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదని., కార్మికులంతా ఏకమై జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.










