Apr 20,2023 06:33

పల్లవ రాజ్యంలో గురుకులంలో సకల విద్యలూ పూర్తి చేసుకున్నారు యువరాజు జయంతుడు, మంత్రి కుమారుడు విజయుడు, రైతు కుమారుడు రామయ్య. గురువు సుధాముడికి వెళ్లి వస్తాము అని పాదాభివందనం చేశారు. వారిని ఆశీర్వదించి పొలిమేరలో ఉన్న పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఏదైనా తిని వెళ్లండి అని చెప్పాడు.
ఆ ముగురూ పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. పెద్దమ్మ వారిని కాసేపు కూర్చోమని చెప్పి. మూడు రొట్టెలు కాల్చి మూడు విస్తర్లలో పెట్టి జయంతుడికి ఇచ్చింది. జయంతుడు వాటిని చూశాడు వాటిలో ఒక రొట్టె బాగా మాడిపోయి ఉంది, మరొకటి ఒక మోస్తరుగా కాల్చబడి, మూడవది బాగా కాల్చినది ఉంది.
మాడిన రొట్టెను మిత్రులకు కనబడకుండా జయంతుడు పెట్టుకుని మోస్తరుగా కాలిన రొట్టెను విజయుడికి, బాగున్న రొట్టెను రామయ్యకు తినడానికి ఇచ్చాడు. ముగ్గురూ తిన్న తరువాత జయంతుడు పెద్దమ్మకు కొంత ధనం ఇచ్చి వెళ్లి వస్తాము చెప్పి కోటకు బయలు దేరారు.
పెద్దమ్మకు వంటలో సహాయం చేసే సీత 'పెద్దమ్మా! మూడు రొట్టెలను మూడు రకాలుగా ఎందుకు కాల్చావు? ఆ గుర్రాల పైన వచ్చి వాటిని తిని వెళ్ళిన వారు ఎవరు?' అని అడిగింది.
'వారిలో బాగా మాడిన రొట్టెను తిన్నది యువరాజు.. ఎందుకంటే అతను రేపు కాబోయే రాజు. ప్రజలను బాగా చూసుకోవలసిన బాధ్యత అతనిది. మంచి రొట్టెను సామాన్యుడైన రామయ్యకు ఇచ్చాడు. రేపు కాబోయే మంత్రి. రాజుకు సహాయకుడు కనుక ఒక మాదిరి రొట్టెను విజయుడికి ఇచ్చాడు. యువరాజును పరీక్షించడానికే అలా చేశాను' అని చెప్పింది పెద్దమ్మ. కాబోయే యువరాజు దయగల వాడు అని అర్థమయ్యింది సీతకి.


- యు. విజయశేఖర రెడ్డి
99597 36475