ప్రజాశక్తి- నందిగామ : రైతు కూలీ సంఘం నాయకుడు చండ్ర శ్రీమన్నారాయణ 15వ వర్ధంతి కమ్మవారిపాలెం గ్రామంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. అమరస్థూపం వద్ద ఎర్రజెండాను రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామావత్ కోట్యా నాయక్ ఎగురవేసి నివాళులర్పించారు. తరువాత శివయ్య చిత్రపటానికి చండ్ర వెంకటరమణ పూలదండతో నివాళులర్పించారు. శివయ్య అన్న సీతారామయ్య, తమ్ముడు సత్యనారాయణ, చండ్ర జనార్థన రావు,గ్రామ సర్పంచ్ పి.నిర్మల, బంధువులు, స్నేహితులు,రైతు కూలీ సంఘం నాయకులు, స్త్రీ విముక్తి సంఘటన నాయకులు, పూలదండలతో నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటంలో నాయకత్వం వహించిన కామ్రేడ్స్ చల్లపల్లి నారాయణరావు, గోగినేని తాతయ్యలను పళనియప్పన్ క్యాంపులో పోలీసులు కాల్చి చంపినటువంటి రోజు కూడా ఇదేనని గుర్తు చేశారు. అమరులకు జోహార్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో భూస్వామ్య, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తమ జీవితాలను బలిదానం చేసి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకత్వం అందించారని, అమరుల జీవిత ఆచరణలను ఆదర్శంగా తీసుకుని రైతాంగం, సమస్త ప్రజలు ఈ వ్యవస్థ మార్పు కోసం ఉద్యమించాల్సిన అవసరం నేడు చాలా ఉన్నదని వివరించారు. ఈనాడు కేంద్ర, రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల పాలనా విధానాలు ఫలితంగా వ్యవసాయ రంగంలోకి బహుళ జాతి కంపెనీల అధిపత్యం పూర్తిగా పెరిగినదని, అందువల్లనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని, ఫలితంగా ఆత్మహత్యలకు గురవుతున్నారని అన్నారు.










