Dec 12,2021 07:05

    'ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ / ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ / ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ / ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్ / డ్రైవర్‌ బాబులకూ ఈ చాయ్ పెట్రోలు/ డాక్టర్‌ బాబులకూ ఈ చాయే టానిక్కూ/ విద్యార్ధుల చదువులకు టీ నీళ్ళే విటమిన్లూ' అంటూ టీ (తేనీరు) చమక్కుల గురించి  చెప్తూ హుషారెత్తిస్తాడో సినీకవి. టీ (తేనీరు), కాఫీ అలవాటు మన నిత్యజీవితంలో ఒక భాగం. టీ తాగనిదే పొద్దు గడవదు. కాఫీ తాగనిదే బెడ్డు దిగరు. అన్ని వేళల్లో టీ తాగడం సర్వసాధారణం. ధనిక, పేద తేడా లేకుండా టీ సేవిస్తారు. ఇంటికొచ్చిన అతిథులకు సైతం మర్యాదగా మొదట అందించేది టీ యే. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ... 'ఎప్పుడు పడితే అప్పుడు/ కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్‌/ చొప్పడిన యూరనుండుము/ చొప్పడకున్నట్టి యూరు చొరకుము' అని. ఎప్పుడుపడితే అప్పుడు కప్పు కాఫీ ఇవ్వగలిగేవారు వుండే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదని దీని అర్థం. మరో సినీ కవి అయితే... 'ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే/ పాచి పళ్ళైనయున్‌ తోమకన్‌ త్రాగు బెడ్‌ కాఫీ/ కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే...' అంటూ ఏకంగా కాఫీ దండకమే పఠించాడు. ఉదయాన్నే కాఫీ, టీ తాగకపోతే మనకు తోచదు. కప్పు కాఫీ తాగితేగానీ బుర్ర పనిచేయదనేవారు చాలామందే వున్నారు. నిద్ర మత్తు వదలాలన్నా... నరాల్లో సన్నాయి మోగాలన్నా... గరం గరం టీ పడాల్సిందే.
    మనదేశంలో టీ సేవకులు, కాఫీ ప్రియులు కోట్లలో ఉన్నారు. సంపన్నుల నుంచి అంత్యంత పేదల వరకూ అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఒకప్పుడు టీ, కాఫీ మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడు ఒక్క టీలోనే ఎన్నో రకాలు వచ్చేశాయి. లెక్కలేనన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. పైగా, మన దేశం నుంచి చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతోంది. అసోం, డార్జిలింగ్‌ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఐరోపా దేశాల్లో టీ కంపెనీలు ఇక్కడి టీ ఎస్టేట్‌ ఓనర్లతో డీల్స్‌ కుదుర్చుకుంటాయి. టీ తోటలు పెరగ గలిగే వాతావరణం గల దేశాలు మనవి. కాఫీ, టీ తోటలన్నీ ఉష్ణ దేశాల్లోనే పెరుగుతాయి. టీ తోటలు పెంచేది మనం... వాటిని మార్కెట్‌ చేసి, డబ్బు సంపాదించుకునేది సామ్రాజ్యవాదులు. మన టీ తోటలపై పెత్తనం కూడా చాలా కాలం బ్రిటీష్‌ వారి కిందే వుంది. అసోం, ఊటీ తదితర చోట్ల వున్న కాఫీ, టీ తోటలు, ఎస్టేట్‌లన్నీ బ్రిటిష్‌ వారి పెత్తనం కిందే నడిచాయి. విశాఖ అరకు ప్రాంతంలోని 11 మండలాల్లో కాఫీ తోటలు వున్నాయి. కానీ వాళ్లెవరూ కాఫీ, టీలు తాగరు. సాగుచేసేది ఒకరు, పెత్తనం చేసేది, అనుభవించేది మరొకరు. 'ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న/ మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి/ కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్‌ చేసి/ కాంటాక్ట్సు సర్వంబు నాశమ్ము కావించుకొంటారుగా...' అని సినీకవి జొన్నవిత్తుల చెబుతారు. టీ, కాఫీలకు ఇంత మహత్తు వుంది గనుకనే... చాయ్ వాలా నంటూ దేశ ప్రజల్ని సులభంగా నమ్మించగలిగారు నరేంద్ర మోడీ.
    భారతదేశంలో ఉత్పత్త్తి అయ్యే టీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా భారతదేశంలోని ప్రధాన దేశీయ టీ వినియోగించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమ ప్రారంభమైన నాటి నుంచి (దాదాపు 180 సంవత్సరాలు) లేని ప్రతికూల ఫలితాలను ఇప్పుడు చవి చూడాల్సి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం, 11 మిలియన్‌లకు పైగా ప్రజలు తమ జీవనోపాధి కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టీ ఉత్పత్తి పరిశ్రమలో వున్నారు. వారిలో 50 శాతం మంది బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళలే. దేశీయ టీ సరఫరాను మరింత బలోపేతం చేయడంతోపాటు సరఫరా, వినియోగం, ఉత్పాదకత యొక్క పద్ధతులను తిరిగి గాడిలో పెట్టాలి. దేశానికి ఆదాయాన్ని, మనిషికి చురుకుదనాన్ని కలిగించే ఈ టీ, కాఫీల మీద పెత్తనం మాత్రం సామ్రాజ్యవాదులది. ఆ పెట్టుబడిదారుల పైనున్న భ్రమలను తొలగించుకొని, ఆ మత్తులోంచి బయట పడినప్పుడే...ప్రతి ఏడాది డిసెంబర్‌ 15న జరుపుకునే అంతర్జాతీయ టీ దినోత్సవానికి మాంచి మసాలా టీ తాగినంత కిక్కు వస్తుంది. మరి ఎన్ని కప్పుల టీ తాగితే పెట్టుబడిదారుల మత్తు నుంచి బయటపడతామో తేల్చుకోవాలి.