- సిఇఒ రవీంద్రన్‌కు నోటీసులు
న్యూఢిల్లీ : పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను అక్రమంగా కొనుగోలు చేసి, కోర్సుల పేరుతో వారి తల్లిదండ్రులను ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ బెదిరిస్తోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌లను బైజూస్ కొనుగోలు చేయడంతో పాటు తమ కోర్సులను కొనుగోలు చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని బెదిరిస్తోందని మాకు తెలిసింది. వారు ప్రాథమిక విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిపై మేము చర్యలను ప్రారంభిస్తాం. అవసరమైతే కేంద్రానికి ఓ నివేదికను తయారు చేసి పంపిస్తాం'' అని ఎన్‌సిపిసిఆర్ చీఫ్ ప్రియాంక కనుంగో ఎఎన్‌ఐ వార్త సంస్థకు తెలిపారు. ఈ విషయమై డిసెంబర్ 23న తమ ముందు హాజరు కావాలని బైజూస్ వ్యవస్థాపకులు, సిఇఒ రవీంద్రన్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఒత్తిడి చేసి కోర్సులను కొనుగోలు చేయించడం, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ నెంబర్లను సంపాదించడం లాంటి అతిక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించామన్నారు. బైజూస్ సంస్థ రుణ ప్రాతిపదికన సైతం తల్లిదండ్రులతో ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపారు. ఎవరైనా తిరిగి తమ మొత్తాన్ని ఇవ్వాలని, ఈ ఒప్పందం నుంచి వెనక్కు వెళ్లిపోతామని కోరినా అంగీకరించకుండా వేధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. బైజూస్‌పై చాలా ఫిర్యాదులు అందాయని తెలిపారు. తాము దోపిడీకి గురయ్యామని, మోసపోయామని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కాలంలో విస్తృత ప్రాచుర్యం పొందిన బైజూస్ సంస్థ పాల్పడుతును అక్రమాలు తాజాగా వెలుగుచూడటం గమనార్హం. మన రాష్ట్రం సహా పలు ప్రభుత్వాలు బైజూస్‌ను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.










