- అన్యమతం పేరుతో రాద్ధాంతం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రాయలసీమకే తలమానికమైన శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ (స్విమ్స్)ని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేసేందుకు టిటిడి ప్రయత్నాలు ప్రారంభించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అధునాతన టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తోంది. 142 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి, తద్వారా ఆస్పత్రి అభివృద్ధికి అన్యమతం పేరుతో బిజెపి మోకాలడ్డుతోంది. స్విమ్స్‌లో అన్యమతస్తులకు పోస్టింగ్ ఇవ్వరాదంటూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ప్రకటన చేశారు. ఇంటర్వ్యూలు జరిపితే అడ్డుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. విభజనకు ముందు స్విమ్స్ ఆస్పత్రి రాయలసీమ ప్రజలకే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందించేది. విభజన తర్వాత ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలందరికీ మంచి వైద్యం అందించాలని టిటిడి సంకల్పించింది. ఈ మేరకు నిధులను టిటిడి కేటాయిస్తూ వచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు బారులు, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికుల పోస్టులతో కలిపి 2,500 మంది స్విమ్స్‌లో పనిచేస్తున్నారు. ఏటా టిటిడి తన బడ్జెట్లో రూ.200 కోట్లకుపైగా స్విమ్స్ అభివృద్ధికి కేటాయిస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. విభాగాలు పెరగడంతో డాక్టర్ల పోస్టుల నియామకం అవసరమైంది. వీటి భర్తీకి ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణులైన ప్రొఫెసర్లు 14 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు 41 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 87 మందిని నియమించనుంది. టిటిడి బోర్డులో అనుమతి తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం రిజర్వేషన్ ప్రాతిపదికన ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మోకాలడ్డేలా ప్రకటన చేశారు. టిటిడి నిధులతో నడుస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో అన్యమతస్తులకు ఉద్యోగావకాశాలు ఇవ్వరాదని, ఇంటర్వ్యూలను అడ్డుకుంటామని, హిందువులను మాత్రమే డాక్టర్లుగా నియమించాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ తిరుపతి గరుడ వారథి నిర్మాణంలోనూ, టిటిడి విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీలోనూ, తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం విషయంలోనూ ఇదే విధంగా బిజెపి కోర్టుకెక్కింది. ప్రజాప్రయోజనాల రీత్యా అవి అవసరమని కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా, బిజెపి వైఖరిలో మార్పులేకపోవడం గమనార్హం.










