పాట్నా : బీహార్ అధికార కూటమిలో ముసలం మొదలైంది. అధికార కూటమిలో మిత్ర పక్షమైన బిజెపిపౖౖె బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుర్రుగా ఉన్నారు. బిజెపితో తెగతెంపులు చేసే యోచనలో జనతాదళ్ (యునైటెడ్) ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపిలను మంగళవారం జరిగే సమావేశానికి జెడియు ఆహ్వానించింది. దీంతో ఆగస్టు 11లోపు బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం కూలిపోయి, మాజీ మిత్ర పక్షమైన ఆర్‌జెడితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, మరోవైపు జెడి(యు) ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున.. ఆర్‌జెడి, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లతో పొత్తు పెట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రంతో దూరం
2019 నుండే కేంద్రంతో నితీష్ విబేధాలు మొదలయ్యాయి. జెడియు నుండి ఒకే ఒక్క కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయడం పట్ల కలత చెందారు. అదేవిధంగా ఏక కాల ఎన్నికలు నిర్వహించాలని మోడీ భావిస్తుండగా.. దీన్ని జెడియు వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి వర్గంలో బిజెపి పెత్తనం చేయడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి పదవులకు... ఎన్‌డిఎ మిత్రపక్షాలకు టోకెన్ విధానం అమలు చేయడంపై కూడా ఆయన గుఉగా ఉన్నారని తెలుస్తోంది. దీంతోనే ఆయన బిజెపి దూరంగా ఉంటున్నారని వినికిడి. గత నెల జులై 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలిచిన ముఖ్యమంత్రుల సమావేశానికి నితీష్ గైర్హాజరయ్యారు. ఆ తర్వాత జులై 22న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందుకు ఆయన ఆహ్వానించగా.. అప్పుడు కూడా హాజరుకాలేదు. ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతునిచ్చినప్పటికీ... ఆమె ప్రమాణస్వీకారానికి కూడా రాలేదు. ఆగస్టు 7వ తేదీన మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు.
ఆర్‌పిసి సింగ్ కూడా కారణమా..?
రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆర్‌జెడి మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సిపి సింగ్‌కు ఎగువ సభ సీటు మరోసారి ఇచ్చేందుకు నితీశ్ కమార్ నిరాకరించారు. గతంలో కూడా నితీశ్ కుమార్‌ను సంప్రదించకుండానే కేంద్ర మంత్రి విస్తరణ సందర్భంగా ఆర్‌సిపి సింగ్ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈ సమయంలోనే ఆర్‌పిసి సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై పార్టీ అధినాయకత్వం వివరణ కోరడంతో ఆయన పార్టీని వీడారు. జెడియు నుండి మూడవసారి రాజ్యసభకు నామినేట్ చేయకపోవడంతో నితీశ్‌కు, ఆర్‌సిపి సింగ్ మధ్య పొరపొచ్ఛాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. బిజెపి రాష్ట్ర నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న ఆయన.. త్వరలో ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో తాను కేంద్ర మంత్రిని కాకుండా ఉండటానికి కుట్ర జరిగిందని నితీశ్‌పై మండిపడుతూ.. ఈ జన్మలో నితీశ్ ప్రధాని కాలేడంటూ వ్యాఖ్యానించారు. మరో వైపు జెడియు అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్).. లోక్ జనశక్తి పార్టీని చీల్చివేసినట్లుగా... తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. బిజెపితో తెగతెంపులపై మంగళవారం సమావేశం జరుగుతోందన్న వార్తలను కొట్టిపారేశారు. మిత్రపక్షం బిజెపితో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
అయితే ఎన్‌డిఎ మిత్రపక్షమైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వలోని హిందూస్తానీ ఆవామ్ మోర్చా కూడా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఆగస్టు 9న.. ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
నితీశ్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయని ఆర్‌జెడి
గతంలో మిత్రపక్షంగా ఉన్న ఆర్‌జెడి-జెడియు.. తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప్పు-నిప్పుగా మారాయి. ఇప్పుడు బిజెపిపై నితీశ్ దూరంగా ఉండటంతో...ఆయనపై విమర్శలు చేయడంలో ఆర్‌జెడి వర్గాలు కాస్త తగ్గాయి. ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని ఆర్‌జెడి అధిష్టానం కూడా ప్రతినిధులందరికీ, శ్రేణులకు సూచించినట్లు సమాచారం. నితీశ్, తేజశ్వి యాదవ్ ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారని, ఆగస్టు 11 లోపు బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునన్న ఊహాగాలు ఊపందుకున్నాయి.










