Jan 28,2023 21:02

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మొక్క నాటుతున్న అధికారులు

       ప్రజాశక్తి-పరిగి   ప్రస్తుత సమాజంలో వ్యవసాయమే దండగ అంటున్న తరుణంలో రసాయన ఎరువులు, కెమికల్స్‌ నుంచి భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పరిగికి చెందిన యువకుడు పవన్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సేవ్‌సాయిల్‌ నినాదంతో పవన్‌కుమార్‌ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆరు రాష్ట్రాలు దాటుకుని కర్ణాటక - ఆంధ్ర బోర్డర్‌ వైపుగా వెళ్తూ కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ను శనివారం కలిసి తన లక్ష్యసాధనకు తమవంతు సహాయ, సహకారాలు కోరారు. ఆయన ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్‌ సౌజన్యలక్ష్మి మండల కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మొక్క నాటారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ భూమి ఎంతో విలువైందన్నారు. అలాంటి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎందైనా ఉందన్నారు. కావున వ్యవసాయంలో రసాయనాలు, ఫర్టిలైజర్స్‌ వాడకాన్ని తగ్గించేందుకు చైతన్యం తీసుకురావాలన్నారు. ఇలాంటి విపత్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే జమ్మూ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ సరస్వతి, అగ్రికల్చర్‌ అధికారిణి విజయభారతి, ఎంఇఒ లక్ష్మీదేవి, డిటి లక్ష్మీనరసింహం, హొన్నంపల్లి సర్పంచి మంజునాథ్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.