Feb 28,2023 19:20

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ మేడసాని మోహన్‌

- పంచసహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌
ప్రజాశక్తి-కడప అర్బన్‌: తెలుగు భాషా సాహిత్యాల కోసం జీవితాన్ని అంకితం చేసిన సి.పి.బ్రౌన్‌ జ్ఞాపకార్థం విజ్ఞాన కేంద్రమైన బ్రౌన్‌ గ్రంథాలయాన్ని నిర్మించడం కోసం అహరహం తపించిన యోగిపుంగవుడు డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని పంచసహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో సి.పి.బ్రౌన్‌ స్మారక గ్రంథాలయ నిర్మాత డాక్టర్‌ జానమద్ది నవమ వర్ధంతిని, స్మారకోపన్యాసాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో ముందుగా అతిథులంతా కలసి ప్రాంగణంలోని సి.పి.బ్రౌన్‌, జానమద్ది, సి.కె.సంపత్‌ కుమార్‌ విగ్రహాలకు, ఆ తర్వాత జానమద్ది చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన మేడసాని మోహన్‌ మాట్లాడుతూ జానమద్దితో తనకు చాలా అనుబంధం ఉందని, తాను 1978లో తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు చదువుతున్నప్పుడు అక్కడ లెక్చరర్ల రెఫ్రషర్‌ కోర్సు జరిగిన సందర్భంలో తాను అవధానం చేశానని, అప్పుడు మొట్టమొదట జానమద్దివారితో పరిచయం ఏర్పడిరదన్నారు. ఆ తర్వాత కడప జిల్లాలో తాను చేసిన పలు అవధాన సభల్లో జానమద్ది కూడా పాల్గొన్నారన్నారు. తన ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా జానమద్ది పాల్గొన్నారని తెలియజేశారు. తెలుగు భాష గొప్పతనాన్ని, అవధాన విశిష్టతను, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనల వైభవాన్ని, అల్లసాని పెద్దన కవితా మాధురిని తన మధుర గంభీర కంఠంతో వినిపించి శ్రోతలను రసపరవశులను చేశారు. సభాధ్యక్షులు, యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య టి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ జానమద్ది గొప్ప దార్శనికుడని, బ్రౌన్‌ గ్రంథాలయం భవిష్యత్తులో ఒక గొప్ప విజ్ఞాన కేంద్రంగా విలసిల్లుతుందని ఆయన ఆనాడే గ్రహించి బ్రౌన్‌ గ్రంథాలయ అభివృద్ధి కోసం జీవిత పర్యంతం శ్రమించారన్నారు. విశిష్ట అతిథి, శ్రీఅచలానంద ఆశ్రమం (బ్రహ్మంగారి మఠం) పీఠాధిపతులు స్వామి విరజానంద మాట్లాడుతూ జానమద్ది తన గురువైన అచలానందస్వామికి సన్నిహితులని, ఆ అనుబంధంతో ఆయన రచించిన అనేక వ్యాసాలు తమ ఆశ్రమం నిర్వహించే 'కాలజ్ఞానసుధ' పత్రికలో వచ్చాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జానమద్ది బహుభాషాకోవిదుడని, తనకు ఆంగ్లం నేర్పిన గురువన్నారు. ఆయన గొప్ప నటుడని, అనేక చారిత్రక, పౌరాణిక నాటకాల్లో నటించాడన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్‌ మాట్లాడుతూ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన తండ్రికి మార్గదర్శకులని, గాడిచర్లవారితో తన తండ్రి వయోజనవిద్యా ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయ నిర్మాణం కోసం పడిన పాట్లను గురించి, అందుకు సహకరించిన అధికారుల గురించి తెలియజేశారు. సాహితీవేత్త ఎస్‌.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ జానమద్దితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, తాను అనేక బ్రౌన్‌ గ్రంథాలయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. బ్రౌన్‌ గ్రంథాలయ సందర్శనకు వచ్చిన ప్రముఖులను జానమద్ది వారు బ్రహ్మంగారి మఠం పంపుతూ తనను దగ్గరుండి వారికి దర్శనం, వసతి సౌకర్యాలను కల్పించమని చెప్పేవారన్నారు. వేదికపై నున్న అతిథులను, జానమద్ది ఆత్మీయుల్కెన సి.పి.బ్రౌన్‌ మెమోరియల్‌ ట్రస్టు సంయుక్త కార్యదర్శి ఎం.జానకిరామ్‌ను, సాహితీవేత్త ఎస్‌.ఈశ్వరరెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సిబ్బంది, బాలవికాస్‌ పాఠశాల విద్యార్థులు, ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డి, గోవిందరెడ్డి, డాక్టర్‌ తవ్వా వెంకటయ్య, డాక్టర్‌ పాలెం వేణుగోపాల్‌, జానమద్ది విజయలక్ష్మి, గానుగపెంట హనుమంతరావు, ఇలియాస్‌రెడ్డి, బాలఎల్లారెడ్డి, కె.వి.రమణారెడ్డి, రాజారెడ్డి, మాచిరాజు రమణయ్య, డాక్టర్‌ వెల్లాల వేంకటేశ్వరాచారి, నాగముని, లోకనాథం, బాలనాయుడు, ప్రతాపరెడ్డి, గురివిరెడ్డి, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, కొత్తపల్లి రామాంజనేయులు, మునికుమార్‌ పాల్గొన్నారు.