Sep 08,2020 08:04


కరోనా అన్‌లాక్‌ - 4 ప్రక్రియలో భాగంగా 9,10, ఇంటర్‌, పి.జి, పిహెచ్‌డి, వృత్తి నైపుణ్య విద్యాలయాలు ఈ నెల 21 నుంచి తెరుచుకునేందుకు అనుమతిస్తూ ఎ.పి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు వెలువరించింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే తాము ఈపని చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తమ పిల్లలు విద్యాలయాలకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని తల్లితండ్రులు రాసివ్వాలి. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 22 నుంచి అన్ని విద్యాసంస్థలూ మూతబడ్డాయి. తిరిగి ఆర్నెల్ల తర్వాత కొంత భాగం తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో పదుల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులున్నప్పుడు మూతబడి, కేసులు ఐదు లక్షలకు పైబడిన సమయాన, అదీ ప్రతి నిత్యం పది వేల మార్క్‌కు తగ్గకుండా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న వేళ, బళ్లు, కళాశాలలు తెరవడం అనాలోచిత నిర్ణయం. వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ బులిటెన్‌ ప్రకారం మన రాష్ట్రం ఐదు లక్షల కేసులతో దేశంలో రెండవ స్థానంలో ఉంది. 4,487 మరణాలు సంభవించాయి. పాజిటివిటీ రేటు గతంలో 12.16 శాతం ఉన్నది కాస్తా కొద్ది రోజులుగా 17.98 శాతానికి పెరిగింది. యాక్టివ్‌ కేసులు లక్ష. వైరస్‌ వ్యాప్తి నగరాలు, పట్టణాలను దాటుకొని గ్రామాలకు విస్తరించింది. రాష్ట్రంలో కోవిడ్‌ ఉధృతి ఇంత భయానకంగా ఉన్న దశలో విద్యాలయాలకు అనుమతించడం ఆందోళనకరం.
విద్యా సంవత్సరం ముగింపు, కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాల దశలో ఒక ప్రణాళికంటూ లేకుండా ఏకపక్షంగా లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పుడు అన్‌లాక్‌ ప్రక్రియ లోనూ అదే చేస్తున్నారు. అందుకు జెఇఇ, నీట్‌ పరీక్షల నిర్వహణే ఉదాహరణ. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక, కరోనా విజృంభణలో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆరు రాష్ట్రాలు రివ్యూ పిటిషన్‌ వేయగా, కోర్టు తిరస్కరించింది. కోర్టు నిర్ణయం కేంద్ర వాదనల ఫలితమే. జెఇఇ మెయిన్స్‌కు దేశ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది రిజిస్టర్‌ చేయించుకోగా లక్షకు పైగా హాజరు కాలేకపోయారు. కరోనా కంటైన్‌మెంట్‌ ప్రాంత విద్యార్థులను పరీక్షలకు రావద్దన్నారు. వారి గతేంటి? రేపు నీట్‌ పరీక్ష రాసేవారిదీ అదే పరిస్థితి. కొన్ని రోజులు నిర్వహించే అరుదైన పరీక్షల సంగతే ఇలా ఉంటే, ఈ నెల 21 నుంచి విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు ఎలా వెళ్లగలుగుతారు? కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరుస్తారా లేదా? ప్రస్తుతం కట్టడి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రవాణాకు అనుమతి లేదు. విద్యార్థులెలా స్కూళ్లకెళతారు? భౌతికదూరం, మాస్క్‌లు, వ్యక్తిగత పరిశుభ్రత బాధ్యత ఎవరిది? అనేక సందేహాలకు ప్రభుత్వం నుంచి జవాబు లేదు.
ఫీజుల కోసం కొన్ని మాసాలుగా కార్పొరేట్‌ స్కూళ్లుఅడ్మిషన్లు, ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈ మధ్య నుంచే ప్రభుత్వ స్కూల్‌
విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా బోధన మొదలు పెట్టారు. కార్పొరేట్‌ స్థాయిలో ట్యాబుల వంటి మౌలిక సదుపాయాలు సర్కారీ విద్యార్థులకు ఉండవు. పైగా 'దూరదర్శన్‌' ప్రమాణాలు తక్కువ. ప్రభుత్వ స్కూళ్లపై ఆధారపడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులకు నష్టం. ఈ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ ఆ వర్గాల పిల్లలకు బలవంతపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడతామంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని కోర్టులకెక్కడం ప్రభుత్వ రెండు నాల్కల వైఖరికి నిదర్శనం. ప్రభుత్వ బడులలో 'నాడు-నేడు' కొంత మేరకు సక్సెస్‌ అయినా అన్‌లాక్‌ ప్రక్రియలో సర్కారీ స్కూళ్లలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆలోచన లేదు. కరోనా కష్టకాలంలోనే కాంట్రాక్టు లెక్చరర్లు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు బకాయి పెట్టింది. ఇలాంటి ప్రభుత్వ వైఫల్యాలెన్నో. కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు విద్యాలయాలను తెరవకపోవడం మంచిది. మొండిగా తెరిస్తే విద్యార్థులకు ప్రమాదం. 'మీ బిడ్డల ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు' అన్న హామీని ప్రభుత్వం ఇవ్వగలిగిన పరిస్థితులు ఏర్పడినప్పుడే బడులు తెరవాలి. అలా కాకుండా పేరెంట్స్‌ ఆమోదం తప్పనిసరి అనడంలోనే ప్రభుత్వానికి నిజాయితీ కొరవడిందన్న సంకేతం ఉంది. తమ పిల్లలు చదువులో వెనకబడతారేమోనన్న భయంతో పేరెంట్స్‌ సమ్మతి తెలిపే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాం మీ చావు చావమనడం దుర్మార్గం. కరోనా అనంతరం విద్యారంగం పరిస్థితిపై ఆ రంగంలో నిపుణులు, మేధావులు, విద్యార్థి సంఘాలతో చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు తగదు.