Feb 23,2023 21:37
  • ఫైనల్‌కు ఆస్ట్రేలియా
  • టాపార్డర్‌ విఫలమైనా.. రోడ్రిగ్స్‌, హర్మన్‌ స్ఫూర్తి దాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా.. చివర్లో ఆదుకొనే బ్యాటర్స్‌ లేకపోవడంతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా మహిళలజట్టు పరాజయాన్ని చవిచూసింది. చివరి ఓవర్‌ వరకు నువ్వా.. నేనా.. అన్నట్టు సాగిన సెమీస్‌ పోరులో టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఓడింది. హర్మన్‌ప్రీత్‌ క్రీజ్‌లో ఉన్నంతవరకు విజయావకాశాలు మనవైపే ఉన్నా.. ఆఖరి 18బంతుల్లో 31పరుగులు చేయాల్సిన దశలో దీప్తి శర్మ పోరాడినా ప్రయోజనం లేకపోయింది. వెరసి ఈసారి టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మహిళలజట్టు సెమీస్‌లోనే నిష్క్రమించింది.

కేప్‌టౌన్‌: డిఫెడింగ్‌ ఛాంపియన్‌, ఐదుసార్లు టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ విజేత ఆస్ట్రేలియా మహిళలజట్టుకు టీమిండియా ముచ్చెమటలు పట్టించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 173పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 167పరుగులు చేయగల్గింది. రోడ్రిగ్స్‌, హర్మన్‌ క్రీజ్‌లో ఉన్నంతవరకు విజయావకాశాలు భారత్‌ పక్షాన ఉన్నా.. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత రీచా ఘోష్‌ కూడా స్వల్ప స్కోర్‌కే ఔట్‌ కావడం గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 172పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ(54), కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 49(నాటౌట్‌), ఆష్లే గార్డినర్‌(31), అలీసా హీలా(25) బ్యాటింగ్‌లో రాణించారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండేకు రెండు, దీప్తి శర్మ, రాధా యాదవ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం 173పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు షెఫాలీ వర్మ(9), మంధాన(2)కి తోడు వన్‌ డౌన్‌లో వచ్చిన యస్టికా భాటియా(4) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారతజట్టు 28పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(52; 34బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్‌), జెమీమా రోడ్రిగ్స్‌(43; 24బంతుల్లో 6ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో భారతజట్టు 10ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌.. బ్రౌన్‌ వేసిన బౌన్సర్‌ను అనవసరంగా ఆడి కీపర్‌కు హీలీకి క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. ఆ తర్వాత హర్మన్‌ అర్ధసెంచరీ పూర్తయ్యాక చేసిన ఓ తప్పిదంతో రనౌట్‌ అయ్యింది. ఆ తర్వాత రీచా ఘోష్‌ ధాటిగా ఆడే క్రమంలో 14పరుగులకే పెవీలియన్‌కు చేరడంతో భారత్‌ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. చివరి 18బంతుల్లో 31పరుగులు చేయాల్సిన దశలో 18వ ఓవర్‌లో 11 పరుగులు చేసినా.. ఆ తర్వాత ఓవర్‌లో 4పరుగులే రావడంతో.. చివరి 6బంతుల్లో 16పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ దశలో భారత్‌ 10పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 7వసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గార్డినర్‌కు లభించగా.. నేడు దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే మరో సెమీస్‌ విజేతతో ఆస్ట్రేలియా జట్టు ఆదివారం ఫైనల్లో తలపడనుంది.

  • స్కోర్‌బోర్డు..

ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్‌:

హీలీ (స్టంప్‌)రీచా (బి)రాధా 25, మూనీ (సి)షెఫాలీ (బి)శిఖా 54, లానింగ్‌ (నాటౌట్‌) 49, గార్డినర్‌ (బి)దీప్తి 31, హర్రీస్‌ (బి)శిఖా పాండే 7, పెర్రీ (నాటౌట్‌) 2, అదనం 4. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 172పరుగులు.
వికెట్ల పతనం: 1/52, 2/88, 3/141, 4/148
బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 4-0-41-0, దీప్తి శర్మ 4-0-30-1, శిఖా పాండే 4-0-32-2, రాధా యాదవ్‌ 4-0-35-1, రాణా 4-0-33-0
ఇండియా మహిళల ఇన్నింగ్స్‌:

షెఫాలీ వర్మ (ఎల్‌బి)స్కట్‌ 9, మంధాన (ఎల్‌బి)గార్డినర్‌ 2, యస్టికా భాటియా (రనౌట్‌)గ్రేక్‌ హర్రీస్‌/హీలీ) 4, రోడ్రిగ్స్‌ (సి)హీలీ (బి)బ్రౌన్‌ 43, హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌)గార్డినర్‌/హీలీ 52, రీచా ఘోష్‌ (సి)మెక్‌ గ్రాత్‌ (బి)బ్రౌన్‌ 14, దీప్తి శర్మ (నాటౌట్‌) 20, రాణా (బి)జన్నాసెన్‌ 11, యాధా యాదవ్‌ (సి)పెఫ్రీ (బి)గార్డినర్‌ 0, శిఖా పాండే (నాటౌట్‌) 1, అదనం 11. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 167పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/15, 3/28, 4/97, 5/133, 6/135, 7/157, 8/162
బౌలింగ్‌: గార్డినర్‌ 4-0-37-2, స్కట్‌ 4-0-34-1, బ్రౌన్‌ 4-0-18-2, పెర్రీ 1-0-14-0, జన్నాసెన్‌ 3-0-22-1, వరేహామ్‌ 3-0-29-0, మెక్‌గ్రాత్‌ 1-0-13-0