కడప అర్బన్ : ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్ల ప్రయివేటీకరణ ఆపాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా కేంద్రంలోని ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట సిఐటియు నాయకత్వంతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాల లీజు పేరుతో జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వ నగధీకరణ పథకమేనని పేర్కొన్నారు. ఆర్‌టిసికి చెందిన 100 బస్సు స్టేషన్లను 33 సంవత్సరాల లీజు పేరుతో ప్రయివేట్ సంస్థలకు, కార్పొరేట్ వ్యక్తులకు ఇవ్వాలని తీవ్ర సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రవాణా మంత్రిత్వ శాఖ ప్రయివేటీకరణ నిర్ఱయాలను ఆర్‌టిసిలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగమే ఏటా వెయ్యి అద్దె బస్సులు, ఆర్టఇసి బస్సుల స్థానంలో ప్రయివేటు విద్యుత్తు బస్సుల ప్రవేశం, స్క్రాపింగ్ పాలసీ, యుటిఎస్ మిషన్లు వంటివి యాజమాన్యం వేగంగా అమలుకు పూనుకుంటున్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రానున్న రోజుల్లో పిపిపి పేరుతో మొత్తం సంస్థను ప్రైవేటీకరణ చేయటానికి మాత్రమే ఈ ప్రయత్నాలు, సన్నాహాలు ముమ్మరం చేశారని తెలిపారు. వడోదర మోడల్ పేరుతో గుజరాత్‌లోని ఎంతో విశాలమైన వడోదర బస్ స్టేషన్‌ను ప్రయివేట్ కన్సార్టియమ్లకి అప్పజెప్పి ఆ బస్ స్టేషన్‌ను అన్ని ప్రయివేట్ బస్సులు వచ్చే ఏర్పాటు చేశారని చెప్పారు. అక్కడ ఆర్‌టిసి బస్సులకు కూడా కొన్ని ప్లాట్‌ఫారం మాత్రం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ల పేరుతో వీటిపై అధ్యయనం చేశారని తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనువాసులురెడ్డి మాట్లాడుతూ గుజరాత్‌కు ఒక అధికారుల బృందాన్ని కూడా పంపి వడోదరా మోడల్‌ను అధ్యయనం చేశారు. వడోదర మోడల్ అంటే అది ఒక విఫల ప్రయోగమని పేర్కొన్నారు. ప్రయివేటీకరణని వీరు అభివృద్ధి అని పిలుస్తున్నారని చెప్పారు. పబ్లిక్, ప్రయివేట్ పార్టిసిపేషన్ పేరుతో జరుగుతుందని తెలిపారు. దేశంలోని 26 ఆర్టీసీలను, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లుగా నడుపుతున్నాయని చెప్పారు. ఎవరికీలేని తొందర ఆర్‌టిసి యాజమాన్యంకు వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులను విలీనం పేరుతో కార్పొరేట్లకు అర్పణం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దివాకర్, కడప జోనల్ కార్యదర్శి భాస్కర్, నాయకులు పి.వి.నాదం, వైఎస్.రాజు పాల్గొన్నారు.










