ప్రజాశక్తి -పెనుకొండ : అర్హత కలిగిన ప్రతి పేదవాడికి భూ పంపిణీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యకాసం ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ రొద్దం, పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లోని కోగిర, గొల్లపల్లి, పందిపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 500 మంది భూమిలేని నిరుపేదలు ఉన్నారన్నారు. వీరు 2వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారని వీరందరికీ సాగు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామాల వారిగా సమస్యలతో కూడిన వినతి పత్రాలను సబ్ కలెక్టర్ కె. కార్తీక్‌కు సమర్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అసైన్మెంట్ చట్టం ప్రకారం భూ పంపిణీ చేయడానికి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్, సోమందేపల్లి మండలం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప, సోమందేపల్లి సిఐటియు నాయకులు కొండా వెంకటేశులు, సాగుదారులు కిష్టప్ప, నరసింహులు, నారాయణ, యశోదమ్మ, గంగాదేవి, సరోజమ్మ, జయంతి, రామాంజనమ్మ, రాజు, బైలాంజనేయులు, బాబు తదితరులతో పాటు 200 మంది సాగుదారులు పాల్గొన్నారు.










