అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. దాదాపు ఆరు నెలలకు పైగా కరోనా బెడదతో నేతన్నల జీవనం దుర్భరం అయింది. ఏడాదికి ఓమారు ఇచ్చే పథకాలు అందరికీ అందలేదు. కొందరికే దక్కాయి. పైగా కరోనా దెబ్బ తీసింది. నడ్డి విరుస్తున్న వడ్డీల బెడద. చేనేతను ఆదుకుంటామన్న బోగస్ చేనేత సొసైటీలు నిధులు దిగమింగి కనుమరుగు అయ్యాయి. అప్పుల బాధ తాళలేక కొందరు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాయలసీమ పట్టు వాణిజ్య కేంద్రం అయిన ధర్మవరం, వేంకటగిరి, ప్రొద్దుటూరు, యాడికి, ఉరవకొండ, హిందూపురంలో చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా వుంది. మిగతా ప్రాంతాలలో నేతన్నలు సైతం పనులు లేక కూలీ పనులకు పోతున్నారు. కష్టాల్లో వున్న చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి. ముడి సరుకును సబ్సిడీ ధరలకు ఇవ్వాలి. అప్పుడే నేతన్నలకు శుభోదయం.










