Jul 17,2023 14:53
  • ఎస్‌కెయు 21వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : వాతావరణ మార్పు, సాంకేతి పురోగతి, సామాజిక అసమానత, ప్రపంచ మహమ్మారి అనే సవాళ్లను ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటోదని, వీటికి వినూత్నమైన పరిష్కారాలను వెతికే బాధ్యత ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న యువతపై ఉందనిరాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన సమర్థనమ్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ జికె మహంతేష్‌కు గౌరవ డాక్టరేట్‌ను విశ్వవిద్యాలయం ప్రదానం చేశారు. వికలాంంగుల క్రికెట్‌కు ఆయన విశేషంగా కృషిసల్పారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 57 మందికి బంగారు పతకాలను గరవ్నర్‌ ప్రదానం చేశారు. 9150 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. ఎస్‌కెయు వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎం రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సావానికి ఛాన్సలర్‌గా గవర్నర్‌ హాజరై మాట్లాడారు. సమాజంలో విద్య అంత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఇది మనిషికి శక్తినే కాకుండా ఆలోచనలకు ఆకృతినిస్తుందని పేర్కొన్నారు. డా మంతేష్‌ మాట్లాడుతూ ఎస్‌కెయు తనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం హర్షనీయమన్నారు. వికలాంగుల క్రికెట్‌ అభివృద్ధికి ఆయన సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
తొలుత యునివర్సిటీలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్‌ పూలమాల వేశారు. ఇంజనీరింగు భవనాన్ని, వసతిగృహాన్ని, అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపి తలారి రంగయ్య, జిల్లా పరిషత్‌ చైౖర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ గౌతమి, ఉన్నత విద్యా మండలి చైౖర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఎస్‌కెయు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.