ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు ఘనంగా ఉన్నా ఫలితాలు కనిపించడం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిధులు వెచ్చిస్తుంటే దానికి అనుగుణంగా అభివృద్ధి, ఉపాధి కల్పన జరగాలి. కనబడాలి. కానీ పెట్టుబడులు వస్తాయని చెప్పినా ఎక్కడ వస్తాయి ? ఎంతమందికి ఉపాధి లభిస్తుందనేదీ స్పస్టత లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2,79,279 కోట్లు ప్రతిపాదించింది. క్యాపిటల్ వ్యయం రూ.31,061 కోట్లు కేటాయించారు. నగదు బదిలీ పథకాలకు 54 వేలు కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.5414 కోట్లు ప్రతిపాదించారు. పోలవరం పునరావాసం, వెలిగొండ, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యే జాడ లేదు. అమరావతి నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్ గురించి ప్రస్తావన లేదు. సిపిఎస్ రద్దు, ఉద్యోగుల బకాయిల ప్రస్తావన లేదు. అంకెల గారడీ విన్యాసాలేగానీ వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఒకవైపు చెబుతూ పెట్టుబడి వ్యయానికి నిధుల కేటాయింపు లేదు. రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటు కీలకం. కడప స్టీలు ప్లాంటు ప్రస్తావన నామమాత్రమే. పారిశ్రామిక మణిరత్నంగా ఉన్న విశాఖ స్టీలు ప్లాంటును అమ్మేస్తున్నారు. పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. అదే సమయంలో అప్పుల కుప్పలూ పేరుకుపోతున్నాయి. ఉపాధి, జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుండి కూలీలు వలసలు వెళ్లిపోతున్నారు. దళిత, గిరిజన సంక్షేమం ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మరెక్కడా లేదనే విధంగా ప్రకటించారు. వారికి అండగా ఉన్న ఉపాధి హామీకి నిధుల కేటాయింపుల్లో పెరుగుదల లేదు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసులు పెరుగుతున్నాయి. నిజంగా వారి భద్రతకు సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకుంటే దాడులు ఎందుకు జరుగుతున్నాయనేది ప్రశ్న. నవరత్నాల పేరుతో కాలం వెళ్లదీత తప్ప అభివృద్ధిగానీ, ఉపాధిగానీ కల్పించలేని విధంగా అంచనాలు, ప్రతిపాదనలు ఉన్నాయి.

- బడ్జెట్ @ 2,79,279 కోట్లు
- మొత్తం ఆదాయం 2,06,224 కోట్లు
- అందులో కేంద్ర నిధులు 46,834 కోట్లు
- మిగిలిన సొమ్ము రుణాల ద్వారానే సేకరణ
- ఆదాయ లోటు 22,316 కోట్లు
- ద్రవ్యలోటు 54,587 కోట్లు
మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2023ా24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,79,279 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఆదాయానికి, వ్యయానికి సంబంధించి ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో భారీ అరచనాలు వేశారు. ఈ నెలాఖరుతో ముగియనును 2022-23 బడ్జెట్ అంచనాలకు సవరించిన అంచనాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తాజా బడ్జెట్‌లో ఆదాయంలో అప్పులను కూడా కలిపి చూపించారు. తద్వారా రెవిన్యూ లోటును తగ్గించి చూపే ప్రయతుం చేశారు. గతేడాది 2,56,256 కోట్లకు బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ఈ ఏడాది 23,023 కోట్లు అదనంగా ప్రతిపాదించారు.
ఈ ఏడాది మొత్తం రుణం 73 వేల కోట్లుగా ప్రతిపాదిరచగా, ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలే 63,000 కోట్లు దాకా ఉన్నాయి. ఇక కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ.46,834 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా.
- బడ్జెట్ వివరాలు అరకెల్లో (రూ. కోట్లలో)
విభాగం 2022-23 2023-24
పన్నుల ఆదాయం 1,91,225 2,06,224
ఎ.పన్నుల్లో వాటా 33,050 41,338
బి.సొంత పన్నుల ద్వారా 91,050 1,02,651
సి.పన్నేతర ఆదాయం 11,092 15,400
డి.రుణాలు 65,031 72,055
మొత్తం ఆదాయం 2,56,256 2,79,279
రెవెన్యూ వ్యయం 2,08,261 2,28,540
ఎ. వడ్డీలకు 21,340 28,673
పెట్టుబడి వ్యయం 30,679 31,061
ఆదాయ లోటు 17,036 22,316
ద్రవ్య లోటు 48,724 54,587
మొత్తం వ్యయం 2,56,256 2,79,279
- సాధికార సాధనే లక్ష్యం : బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
రాష్ట్ర ప్రజలను సాధికార దిశలో నడిపించడమే ప్రభుత్వ ప్రోత్సాహాల లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజరేంధ్రనాధ్ అన్నారు. 2023ా24వ సంవత్సరపు బడ్జెట్‌ను శాసనసభలో గురువారం ఆయన ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాలతోనే రాష్ట్ర ప్రజానీకం సాధికారిత సాధించి ప్రపంచంలో గుర్తింపు పొందే విధంగా బడ్జెట్‌ను రూపొందిచినట్లు చెప్పారు. సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలతో సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. 2,79,279 కోట్ల వ్యయంతో ఆయన బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు ప్రతిపాదించారు. దాదాపు గంటన్నర సాగిన ఆర్థిక మంత్రి ప్రసంగంలో అనేక సూక్తులను, పద్యాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనోహన్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. బడ్జెట్ ప్రసంగం చేస్తూనే నిధులు కేటాయించిన ప్రాంత ఎంఎల్‌ఏలను పేరు, పేరునా ప్రస్తావిస్తూ ఆ పథకాలను వివరించారు. ముందురోజు గవర్నర్ చేసిన ప్రసంగంలో ఉన్న ఎక్కువ అంశాలే బడ్జెట్ ప్రసంగంలోనూ ఉన్నాయి.
విభజన, కోవిడ్ సమస్యలతో పోరాటం చేయాల్సి వచ్చిందని, ఆరోగ్య సంరక్షణలోనూ సుస్ధిరాభివృద్ధి సాధించామని చెప్పారు.17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బలమైన రాజకీయ నాయకత్వం ఉండాలని, మంచి విధానాలను అమలు చేయాలని అన్నారు.
విధానపరమైన ఆవిష్కరణలు, వినూత్న పాలనా విధానాలను ప్రభుత్వ విశిష్ట లక్షణాలని వివరించారు. రాష్ట్రంలో 15,004 గ్రామ,వార్డు సచివాలయాల ఏర్పాటు చేయడం ద్వారా 1.34 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. 51,488 మంది ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం వంటి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో సమూల మార్పులు చేశామని వివరించారు. 21 రకాల పథకాల ద్వారా రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులందరికీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఇప్పటి వరకూ 1.97 లక్షలకోట్ల రూపాయలను ప్రజలకు అందించామని చెప్పారు. స్థూల వృద్ధికి సంబంధించి సుస్ధిరమైన ధరలలో రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉందని వివరించారు ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల వల్ల పెట్టుబడి, వినియోగం రెండిటినీ అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిని సాధించిందని చెప్పారు. జిఎస్‌డిపిలో ఒకటోస్థానంలో ఉంటూ 11.43 శాతం వృద్ధి నమోదు చేశామని పేర్కొన్నారు. అంత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తన లక్ష్యాలను నెరవేర్చిందని చెప్పారు. నవరత్నాలు, మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలు సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలతో ఏకీభవిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు వంటి అనేక పథకాలు ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. మహిళలకు సున్నావడ్డీ పథకం అమలు చేస్తున్నామని, వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి కొనసాగిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ చేశామని వివరించారు. మహిళలు, పిల్లలు, మైనార్టీలు, దళితులు, గిరిజనులకు భారీగా నిధులు కేటాయింపులు జరిపామని తెలిపారు. చిన్న పిల్లలకు గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. అలాగే రుణాలు సకాలంలో తిరిగి చెల్లించే పద్థతిని ప్రోత్సహించేందుకు సున్నావడ్డీ పథకాన్ని ప్రవేశపెటామని వివరించారు. జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.










