- బాలకృష్ణ ప్రవర్తనపై సభ హెచ్చరిక
- చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానంను తిరస్కరణ
ప్రజాశక్తి-అమరావతి : వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. ముగ్గురు సభ్యులను(కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్) ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మరో 14 టిడిపి సభ్యులను ఒకరోజు సస్పెండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ సభాస్థానాన్ని చుట్టుముట్టి అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరారని అన్నారు. ప్రజాస్వామికంగా నిరసన తెలియజేయకుండా మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం వంటి వికృత చేష్టలు చేయడం తప్పని అన్నారు. సభా వేదికపై ఈ విధంగా ప్రవర్తించిన బాలకృష్ణకు సభ హెచ్చరిస్తుందని, మొదటి తప్పుగా క్షమిస్తుందని తెలిపారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. స్పీకర్ మాట్లాడుతుండగా టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ టిడిపి సభ్యుల తీరుపై మండిపడినా వారు ఆందోళన కొనసాగించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై బాల గోవింద స్వామి ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.










