ప్రజాశక్తి-అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమై, కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల అనంతరం బిఏసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొనున్నారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ పోడియం దగ్గర టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం చోటుచేసుకుంది. కళ్యాణమస్తు ఆపేసారని టిడిపి అబద్ధపు ప్రచారం చేస్తుందని మెరుగు నాగార్జున తెలిపారు. టిడిపి సభ్యుల తీరుపై బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రతిసారి అర్థం పడడం లేని వాయిదా తీర్మానం ఇచ్చి సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టిడిపి వారి దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు. టిడిపి సభ్యుల నినాదాలు మధ్య సభ కొనసాగుతుంది.
మంత్రి అంబటి రాంబాబు టిడిపి సభ్యులపై మండిపడ్డారు. చంద్రబాబు అనేక పాపాలు ఘోరాలు చేశారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు పూర్తి ఆధారాలతో దొరికిపోయారని ఆయన తెలిపారు. అసెంబ్లీ వేదికగా టిడిపి నేతలు తప్పును ఒప్పుకోవాలని ఆయన అన్నారు. టిడిపి సభ్యులు పోడియంను చుట్టుముట్టిన తీరు స్పీకర్ పై దాడి చేస్తున్నట్లుగా ఉందని అన్నారు. వైసిపి సభ్యులను రెచ్చగొడుతున్నారని ఇది సరైన కాదని అన్నారు. ముందు జాగ్రత్తగా టిడిపి సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంబటి రాంబాబుకి, బాలకృష్ణకు మధ్య వాగ్వివాదం జరిగింది. వైసిపి, టిడిపి సభ్యుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ఇరు పార్టీల సభ్యులు రా.. అంటే రా.. అంటూ సవాల్ విసురుకున్నారు. దీంతో అసెంబ్లీ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని తెలిపారు.
మరోవైపు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని పట్టుపట్టారు. ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరష్కరించడంతో టిడిపి సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. దీంతో శాసన మండలి సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.










