Feb 25,2023 20:12

చిరుత పాదాలకు గుర్తులను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ లక్ష్మీనగర్‌ గ్రామ వెనుకన ఉన్న పొలాల్లో పులి కాలి గుర్తులు ఉన్నట్టు రైతులు, ప్రజలు వ్యవసాయ సలహా మండల జిల్లా చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే ఎఫ్‌ఆర్‌ఒ రఘునాథరెడ్డికి సమాచారం అందించి వారితో పాటు సిబ్బంది, రైతులతో కలిసి పులి సంచరించే పరిసరాలను పరిశీలించి పులి పాద ముద్రలను గుర్తించారు. అవి చిరుత పులి కాలి ముద్రలని రఘునాథరెడ్డి తెలిపారు. అనంతరం అనంతరాజుపేట సచివాలయంలో సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బహిర్భూమికి పంట పొలాల వైపు వెళ్లకూడదన్నారు. రైతులు ఒంటరిగా కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి పొలాలకు వద్దకు వెళ్లాలని తెలిపారు. రాత్రి వేళల్లో రెండు గంటలు ఇచ్చే వ్యవసాయ విద్యుత్తును పగటి సమయాల్లో ఇవ్వాలని విద్యుత్‌ శాఖ అధికారులకు విన్నవించారు. సచివాలయ సిబ్బంది మహిళా పోలీస్‌తో మాట్లాడుతూ గ్రామాల ప్రజలకు చిరుతపులి తిరుగుతున్నట్లు వివరించాలన్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగరాదని ముఖ్యంగా కరెంటు లేని సమయాల్లో ఇంటి నుంచి బయటకు రాకూడదని జాగ్రత్తలు తెలపాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా మరో మారు పులి సంచరించినట్టు తెలిసిన అటవీ శాఖ అధికారులకు గాని, తన దృష్టికి తీసుకురావాలని సుకుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రైతులు శ్రీధర్‌, సిద్దయ్య, శ్రీనివాసులు, పెంచలయ్య ఫారెస్ట్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.