అనంతపురం ప్రతినిధి : రాప్తాడులో మొదలైన రాజకీయ రచ్చ అనంతపురం నగరానికి తాకింది. సోమవారం ఉదయం నుంచి టిడిపి, వైసిపి రెండు గ్రూపులూ పోటాపోటీగా ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోషియల్ మీడియాలో మొదలైన మాటల యుద్ధం భౌతిక దాడులకు సిద్ధపడేంత వరకు చేరుకుంది. రెండు రోజుల క్రితం టిడిపి నాయకులు గంటాపురం జగ్గు రాప్తాడు వైసిపి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై వైసిపి అనయాయులు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పరిటాల రవీంద్ర హత్యకేసులోని నిందితులు మొద్దుశీను అనుకుంటే చంద్రబాబు నాయుడుని చంపేసేవాడని, ఇకపై చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ తమ లక్ష్యమని సోషియల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగానే దుమారం రేపాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తెలుగుయువత ఆధ్వర్యంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. వీటన్నింటిపైనా టిడిపి నాయకులు రాష్ట్ర నాయకులు పట్టాభి, మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పిఎసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తదితరులు ర్యాలీగా వచ్చి ఎస్పీ ఫక్కీరప్పకు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబునాయుడిపై వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాష్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి పోటీగా వైసిపినూ నగరంలో ప్రదర్శన చేపట్టింది. టిడిపి నాయకులే అనవసరంగా రెచ్చగొడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. వీరు కూడా జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలసి వినతిపత్రం అందజేశారు. ఇద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో రాజకీయ వేడి రాజుకుంది. నాయకుల ఇళ్ల వద్ద కూడా ఆయా పార్టీల నాయకులు చేరుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో నాయకులను సమన్వయం చేయడానికి పోలీసులు అనేక ఇబ్బందులు పడ్డారు. తెలుగుయువత నాయకులను అదుపు చేసే క్రమంలో లాఠీఛార్జీ సైతం చేశారు.
మాటల యుద్ధం కాస్త...భౌతిక దాడుల వరకు...
జాకీ పరిశ్రమ తరలిపోవడంపై మాటలతో ప్రారంభమైన యుద్ధం భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. దీంతో రాప్తాడులో రాజకీయాలు తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులకు చేరుతున్నాయి. పోటాపోటీగా టిడిపి, వైసిపి నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముందు నుంచి రాప్తాడు ఫ్యాక్షన్ ప్రాంతంగా ఉంది. ఇటీవలి కాలంలోనే కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తిరిగి ఉద్రిక్తత పరిస్థితులు మొదలయ్యాయా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.










