కడప అర్బన్
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతు న్న స్మగ్లర్లపై ఉక్కు పాదం మోపామని అందులో భాగంగా అంతర్జాతీయ స్మగ్లర్ ఇరగంరెడ్డి దస్తగిరి రెడ్డి (32)ని అరెస్టు చేసినట్లు ఎస్‌పి అన్బురాజన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మగ్లర్ నుంచి 603 కేజీల బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, 2 కార్లు, రెండు సెల్ ఫోన్స్, వైఫై రూటర్, ఏటీఎం కార్డు, రూ. 2,500 నగదు, రెండు గొడ్డళ్లు, రెండు కట్టెలు, మూడు పట్టుడు రాళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇంటి దొంగతనాలలో మోస్ట్ వాంటెడ్ ఇరగం రెడ్డి దస్తగిరిరెడ్డి ఉన్నాడని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో అతనిపై సుమారు 36 ఇంటి దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. 86 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, 2 పీడీ యాక్టులున్నాయని వివరించారు. అతని స్వగ్రామం దువ్వూరు మండలమని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దస్తగిరిరెడ్డి పేరు మోసిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లు సింపతి లాల్‌బాషా, ఫకృద్దీన్‌లతో కలిసి ముఠాగా ఏర్పడి కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం చెట్లను నరికించి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. బడాస్మగ్లర్‌ను అరెస్టు చేసిన ఒంటిమిట్ట సిఐ పురుషోత్తమరాజు, రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్సు సిఐ నాగభూషణం, సిద్దవటం ఎస్‌ఐ తులసి నాగప్రసాద్, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్‌ఐ అభినందించారు. వారికి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు.










