Jan 24,2023 22:15

ధర్మవరంలో వినతిపత్రం అందజేస్తున్న నాయకులు, అంగన్వాడీలు

ధర్మవరం టౌన్‌ : పేస్‌ యాప్‌ ను తక్షణమే రద్దుచేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక లక్ష్మీ చెన్నకేశవపురంలో ఉన్న ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్షాద్‌ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, అందుకు తగ్గట్టుగా వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలన్నారు. 2017 నుంచి పెండింగ్‌ లో ఉన్న టిఎ బిల్లులు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారం గౌరవవేతనం ఇవ్వాలని, సూపర్వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగిం చాలని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌ 1ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎల్‌ ఆదినారాయణ, ఆయూబ్‌ఖాన్‌, ఆంగన్వాడీలు పాల్గొన్నారు.
పెనుకొండ : అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు బావమ్మ, ప్రాజెక్ట్‌ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన పేస్‌ యాప్‌వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని,అందులో యాప్స్‌ ఓపెన్‌ కాలేదని, ఫేస్‌ యాప్‌ హాజరు వేయడం సాధ్యం కాని పని అన్నారు. కొన్ని గ్రామాల్లో నెట్‌వర్క్‌ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆన్‌లైన్‌్‌ వర్క్‌ చేయలేక అధికారులు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక మనస్థాపానికి గురవుతున్నారన్నారు. పలు అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులు లేవని,కరెంటు సౌకర్యం కూడా లేదని అన్నారు. 5 సంవత్సరాలు నుండి టిఎ, డిఎ చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌తో కలసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, మురళి, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు జయమ్మ, లక్ష్మి, వరలక్ష్మి, మంజుల, నాగమణి, షర్మిలభాను, ఉషారాణి, అనంతమ్మ, సుబ్బలక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేతనాలతో పాటు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నా టిఎ, డిఎ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక సిడిపిఒ కార్యాలయం ముందు ఆందోళన చేసి, సిడిపిఒకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఫిబ్రవరి 6న కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు శోభారాణి, కోశాధికారి శిరీష, సెక్టార్‌ లీడర్లు గీతా, వాణి, వరలక్ష్మి రాజమ్మ ధనమ్మ, శివమ్మ, భాగ్యమ్మ, పద్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.