Feb 28,2023 19:18

విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న డివైఇఒ

ప్రజాశక్తి-పీలేరు: ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోకి 'ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌-ప్యానెల్‌ డిస్‌ప్లే' (ఐఎఫ్‌పిడి)ని అందుబాటులోకి తీసుకు రానుందని తిరుపతి డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి ఆనందరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక అయ్యప్పరెడ్డి కాలనీలోని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డివైఇఒ ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.జయమ్మ అధ్వర్యంలో బోధనా సిబ్బందితో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఐఎఫ్‌పిడి అనేది పెద్ద ఫార్మాట్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే అని, ఇది తరగతి గదులకు చాలా అనువైనదని కూడా చెప్పారు. అధిక-నాణ్యత, డిస్‌ప్లే, మెరుగైన కనెక్టివిటీ, అంతర్నిర్మిత సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఇందులోని ప్రత్యేకతని పేర్కొన్నారు. ఇది అస్తవ్యస్తమైన లేదా పాత ప్రొజెక్టర్‌ టెక్నాలజీకి ప్రత్యామ్నాయమన్నారు. 8వ తరగతి విద్యార్థులతో ఇంట్రాక్టై బైజుస్‌ ట్యాబును వారెలా వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ట్యాబులపై విద్యార్థులకున్న అనుమానాలను నివత్తి చేశారు. కేవలం పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాల కోసం ట్యాబ్‌లను అప్డేట్‌ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చిందని, కార్పొరేట్‌ పాఠశాలల స్థాయికి మించి ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతుందని అన్నారు. డివైఇఒ పిల్లల ప్రతిస్పందనపై సంతప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్లోరి, ఝాన్సీరాణి, మధులత, వై.విజయ కుమారి, సుధారాణి, జానం సుజాత, శ్రీకళ, సౌజన్య, స్వర్ణలత, స్వప్నలత, జి.విజయకుమారి, ఉమామహేశ్వరి, ప్రసన్నలక్ష్మి, మెరీనా, సంపూర్ణ బోధ నేతర సిబ్బంది జూలీ, రేష్మ, అంజమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.