Sep 04,2020 18:28

విశాఖ రక్షణ రంగంలో నెల రోజుల్లో 12 మంది మృత్యువాత పడ్డారు (డాక్‌ యార్డ్‌లో ఐదుగురు, ఎన్‌ఎస్‌టిఎల్‌ లో ముగ్గురు, ఎన్‌ఎడి లో ఇద్దరు, ఎంఓవి లో ఒక్కరు, ఎస్‌బిసి లో ఒక్కరు). రక్షణ రంగంలో రిటైర్‌ అయిన వారి కుటుంబ సభ్యులు 26 మంది చనిపోయారు. వీరి మరణాలకు కారణం వైద్యం అందక పోవడమే. వీటికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. డాక్‌ యార్డ్‌లో 168, ఎన్‌ఎడి లో 49, ఎస్‌బిసి లో 36, ఎన్‌ఎస్‌టిఎల్‌ లో 16, ఇతర సంస్థలలో 28 మంది కరోనా బారిన పడ్డారు. కొంతమంది ఉద్యోగుల కుటుంబ సభ్యులు మొత్తం కరోనాకు గురయ్యారు. రక్షణ రంగ పరిధిలో పని చేస్తున్న వందల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు కరోనా బారిన పడ్డారు. 18 కోట్ల రూపాయల బకాయిలను కేంద్ర ప్రభుత్వము, విశాఖ రక్షణ రంగ యాజమాన్యాలు చెల్లించలేదు గనుక వైద్యం ఆపివేసినట్లు కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు చెప్పాయి. వైద్య సేవలు కొనసాగించేటట్లు చేయమని యూనియన్లు మేనేజ్‌మెంట్లకు అనేక దఫాలు విన్నవించుకున్నాయి. ఇప్పటికీ అధికారులు శ్రద్ధ పెట్టలేదు. సమస్య పరిష్కారం కాలేదు.
విశాఖ రక్షణ రంగంలో 12,000 మంది సివిలియన్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి, వీరి కుటుంబాలకు కరోనాతో సహా అన్ని రకాల వైద్యం అందజేయాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్ల పై ఉంది. కరోనాను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యతను నెట్టివేసి, తమ బాధ్యతల నుండి తప్పించుకోవాలని తూర్పు నౌకాదళ యాజమాన్యం చూస్తున్నది. 15 వేల మంది రిటైర్‌ అయినటువంటి రక్షణ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైద్య స్కీమ్‌ (సిజిహెచ్‌ఎస్‌) ద్వారా వీరందరికీ వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో దేశవ్యాప్తంగాను, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో వైద్య సేవలు నిలిచిపోయాయి. పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎంత మొర పెట్టుకున్నా వైద్య సేవలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రక్షణ రంగ, పబ్లిక్‌ రంగ సంస్థల అమ్మకాలలో మునిగిపోయిన కేంద్ర ప్రభుత్వం...దేశ ప్రజలను కరోనాకు, ఉద్యోగులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు బలి చేస్తున్నది. స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు ధారపోస్తున్న మోడీ, 42 లక్షల పెన్షనర్ల వైద్య ఖర్చుల బకాయిలకు సంబంధించిన 400 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రాలేదు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం 16 వేలుగా ఉన్న తమ సిబ్బంది కోసం (కోవిడ్‌ పేషెంట్ల కోసం) 30 పడకలను కేటాయించింది. హాస్టల్‌ను ఖాళీ చేయించి 53 రూములను ఐసొలేషన్‌/క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చింది. విశాఖ పోర్టు యాజమాన్యం 4 వేల మంది ఉద్యోగులు, 13 వేల మంది రిటైరైన ఉద్యోగుల కోసం, పోర్ట్‌ ఇండోర్‌ స్టేడియంలో 60 పడకలతో ఐసొలేషన్‌/క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. వారి ఆసుపత్రిలో ఒక అంతస్తు మొత్తాన్ని కోవిడ్‌ చికిత్స కోసం కేటాయించింది. విశాఖ రైల్వే యాజమాన్యం 30 పడకలను కోవిడ్‌ రోగుల కోసం కేటాయించింది. ఈ అన్ని సంస్థలు అవసరమైన డాక్టర్లను, వైద్య సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నారు. కోవిడ్‌ టెస్టులను వారి ఆస్పత్రుల ఆధ్వర్యంలోనే చేసుకుంటున్నారు. వెంటిలేటర్ల చికిత్స అవసరమైన రోగాలకు అధికారులే బాధ్యత తీసుకొని అనుబంధ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆస్పత్రిలో వారి పరిధి లోని సివిలియన్‌ ఉద్యోగులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కటి విశాఖ లోని నావెల్‌ యాజమాన్యంగాని, సిజిహెచ్‌ సెంటర్లు గాని చేయడం లేదు. కనీసం వారి పరిధిలో చేయగలిగిన వాటిని చేసేందుకు కూడా తీవ్రంగా నిరాకరిస్తున్నారు.  తమ పరిధిలో ఉన్న డాక్టర్లతో సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్యం అందజేయడానికి నిరాకరిస్తున్నారు. కళ్యాణి ఆస్పత్రిలో సివిలియన్‌ ఉద్యోగులకు చికిత్స అందజేసినట్లు పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఇది పచ్చి అవాస్తవం. కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స చేసిన సివిలియన్‌ ఉద్యోగుల పేర్లు ప్రకటించాలని మేనేజ్‌మెంట్‌కు సవాలు చేస్తున్నాం. అచేతన వైఖరిని, అసంబద్ధ ప్రకటనలను మానుకొని వైద్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరుతున్నాం.
మన రాష్ట్రంలో నెల రోజుల్లో మూడు లక్షల కేసులు వచ్చాయి. విశాఖ నగరంలో రోజుకు 1000 కేసులకు తక్కువ కాకుండా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రక్షణ రంగ కార్మికులు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. దేశ సరిహద్దులలో నేడు ఉన్న పరిస్థితి రీత్యా కార్మికులు తప్పనిసరిగా ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుచేత పోస్టల్‌ డిస్పెన్సరీలు, సిజిహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, అన్ని డిఫెన్స్‌ కాలనీలలో కోవిడ్‌ టెస్టులు చేయించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆసుపత్రులకు బకాయిలు వెంటనే చెల్లించి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి. ఆసుపత్రులు వసూలు చేస్తున్న నాన్‌ మెడికల్‌ ఛార్జీలన్నిటిని ప్రభుత్వమే చెల్లించాలి. రోజువారి విధులకు హాజరవుతున్న రక్షణ రంగ సివిలియన్‌ ఉద్యోగులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌ అమలు చేయాలి. విశాఖ రక్షణ రంగ కార్మికుల కోసం అధునాతన ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కరోనా తీవ్రత తగ్గేవరకు అన్ని సంస్థల కార్మికులు, ఉద్యోగులను అత్యవసర విధులకు మాత్రమే పిలిచి మిగిలిన వారిని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గా పరిగణించాలి. ఉద్యోగులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇతర రక్షణ పరికరాలు సమకూర్చాలి. పరిశ్రమలోని క్యాంటీన్ల ద్వారా పోషకాహారాన్ని అందించాలి. ఈ చర్యల అమలు కోసం రక్షణ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులను కలుపుకొని ఉద్యమించాలి.


- రెడ్డి వెంకట రావు

(చైర్మన్‌ డిఫెన్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌, విశాఖపట్నం)