ఇంఫాల్ : మణిపూర్‌లో బిజెపి ప్రభుత్వానికి కుకీ పీపుల్స్ అలయన్స్ (కెపిఎ) షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 160 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి తెగదెంపులు చేసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కెపిఎ అధ్యక్షులు టాంగ్‌మాంగ్ హౌకిప్ మణిపూర్ గవర్నర్ అనసూయీ ఉకేకి లేఖ ద్వారా తెలియజేశారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని తమ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, వెంటనే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ కు రాసిన లేఖలో టాంగ్‌మాంగ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన గత నెల 18న ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌డిఎ సమావేశంలో కెపిఎ పాల్గొన్న సంగతి తెలిసిందే.
మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. బిజెపికి 32 మంది సభ్యుల బలం ఉంది. ఐదుగురు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు , ఇద్దరు కెపిఎ ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రకటనతో కెపిఎ ఎమ్మెల్యేల మద్దతు బిజెపి ప్రభుత్వం కోల్పోయింది.










