పుట్టపర్తి అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న వివిధ రకాల పథకాలకు సంబంధించిన రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేయడంలో బ్యాంకర్లు, అధికారుల మధ్య సమన్వయం అవసరం అని కలెక్టర్ బసంత్‌కుమార్ పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నాడు జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు, పంపిణీని బ్యాంకర్లు వేగవంతంగా చేపట్టాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు వెంటనే పురోగతి సాధించేలా ప్రత్యేక దష్టి సారించాలన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం ముద్ర యోజన కింద రుణాలు, వీవర్స్‌కు, పశుసంవర్ధక, మత్స్య రైతులకు రుణాలు అందించడంలో మరింత పురోగతి చూపించాలన్నారు. జగనన్న తోడు పథకం కింద డీఆర్డీఏ, మెప్మా పరిధిలో చిరు వ్యాపారులకు అందించే రుణాల లక్ష్యం చేరుకోలేదని, వెంటనే అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి పంపిణీ చేసేలా చూడాలన్నారు. జగనన్న తోడు, టిడ్కో, హౌసింగ్‌కి సంబంధించి రుణాల మంజూరు చాలా పెండింగ్ ఉందని, వెంటనే కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం సక్రమంగా ఉండాలన్నారు. రుణాల మంజూరులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేలా కషి చేయాలని, కేటాయించిన లక్ష్యాలను పూర్తిగా 100 శాతం చేరుకోవాలన్నారు. ఇకపై ప్రతి నెలా బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆయా సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు హాజరై విధంగా లీడ్ బ్యాంకు మేనేజర్ చర్యలు చేపట్టాలని తెలిపారు. డిఐసిసిఐ జిల్లా కోఆర్డినేటర్ సభ్యులు కెవి.రమణ మాట్లాడుతూ అర్హత కలిగిన ఎస్సీ ,ఎస్టీ, ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన స్టాండర్డ్ ఇండియా పథకంపై అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం బ్యాంకుల లక్ష్యాల గురించి నాబార్డ్ ఏజీఎం ద్వారా రూపొందించిన జిల్లా వార్షిక ప్రణాళికను రూపొందించారు. 2023-24కు సంబంధించి 741575.39 కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక ప్రణాళికను తయారు చేసినట్లు ఎల్డీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బిఐ ఎల్‌డిఓ శరత్‌చంద్ర, ఎల్‌డిఎం సాయినాథ్ రెడ్డి, కెనరా బ్యాంకు ఏజీఎం రాంప్రసాద్ రెడ్డి ,ఎస్‌బిఐ ధర్మవరం ఆర్‌ఎం సంజీత్ కుమార్, యూబిఐ బ్యాంక్ ఏజీఎం అశ్వర్థ నాయక్, నాబార్డ్ డిడి ఉషా మధుసూదన్, డీఆర్డీఏ పీడీ నర్సయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, సెరికల్చర్ జేడీ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.










