బాలోత్సవాలు జరుగుతున్న అన్ని ప్రాంతాలలో ఐఎఎస్‌లతో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కవులు, రచయితలు, శాస్త్రీయ నాట్య శిక్షణా సంస్థలు, డాన్స్ అకాడమీలు, సేవా సంస్థలు, లయన్స్, రోటరీ క్లబ్‌లు, సీనియర్ సిటిజన్స్, సేవాతత్పరులు, దాతలు, నగర ప్రముఖులు, వివిధ విద్యా, కళా రంగాలలో నిష్ణాతులు రాజకీయాలకు అతీతంగా వివిధ రూపాలలో సహకారం అందిస్తున్నారు. విద్య అంటే మార్కులు, ర్యాంకులు గాక బాలబాలికలకు అసక్తి ఉన్న అన్ని రకాల విద్యలను నేర్పాలని, సమాజాన్ని అర్థం చేసుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వంగా కలసి ఉండాలనే సందేశాన్ని వక్తలు అందజేయడం ముఖ్యమైన అంశం.
కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లు, చెవులు దిబ్బుళ్లెత్తించే భారీ మ్యూజిక్ సెట్టింగులతో పెద్ద పెద్ద భవనాలలో మాత్రమే కళలను ప్రదర్శించవచ్చనుకునే నేటి రోజుల్లో జానపద కళలు అంతరించిపోతున్నాయి. స్కూల్లో వున్నంత సేపూ ర్యాంకుల పరుగులు, ఇంటికొచ్చాక వీడియో గేములు, కంప్యూటర్లలో మునిగితేలే చిన్నారులకు కూసింత శాస్త్రీయ ఆలోచనను రేకెత్తించే, ఉత్సాహాన్ని నింపే, మానసిక ఉల్లాసాన్నిచ్చే, శారీరక వ్యాయామాన్ని కల్పించే ఆటపాటలను పరిచయం చేస్తే చాలు. సాదాసీదా వేదికల మీద కూడా తమ ప్రతిభాపాటవాలను అవలీలగా ప్రదర్శిస్తారు. అందుకు మచ్చుతునకలే 'బాలోత్సవ్' వంటి కార్యక్రమాలు. వీటికి పిల్లల నుంచే కాక వారి తల్లిదండ్రుల నుంచి కూడా చక్కటి ఆదరణ లభిస్తోంది.
తగిన వేదికలు, అవకాశాలు కల్పిస్తే సాంస్కృతిక రంగంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సృజనాత్మకమైన, వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తే ప్రజలు భాగస్వాములవుతున్నారు. విజ్ఞాన కేంద్రాలు, సాంస్కృతిక వేదికలు, మహిళా సంఘాలు, చిత్రకళా సంస్థలు, బాలోత్సవాలు చేస్తున్న కృషికి అద్భుతమైన స్పందన వ్యక్తమవుతోంది.
బాలోత్సవాల ప్రత్యేకత
రాష్ట్రంలో అన్ని రకాల యాజమాన్యాలలోని హైస్కూళ్ళలో చదువుకొనే బాలబాలికలను ఓ పండగగా ఒక చోట కలిపే సంగమం బాలోత్సవం. విద్యా, సాంస్కృతిక అంశాలపై విద్యార్థులలో దాగి ఉన్న సృజనను, ప్రతిభా పాటవాలను వెలికితీసే కార్యక్రమం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 సంవత్సరాల పాటు నిర్వహించిన కొత్తగూడెం బాలోత్సవం నుండి నేడు ఎ.పి అంతటా 10 జిల్లాలకు విస్తరించి కొత్త పుంతలు తొక్కుతోంది.
తాడేపల్లిలో ఉగాది బాలోత్సవం
విజయవాడ ఆనుకొని ఉన్న తాడేపల్లిలో, జాతీయ రహదారికి ఇరువైపులా 500 పైగా అపార్ట్‌మెంట్ ప్రాంగణాలు నిర్మించబడ్డాయి. వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఎవరికి వారే యమునా తీరే చందంగా బతుకుతున్న స్థితిలో అమరావతి బాలోత్సవం, అపార్ట్‌మెంట్ల అసోసియేషన్లు కలిసి ఏప్రిల్ 2న ఉగాది బాలోత్సవాన్ని జరుపగా 800 మంది పాల్గొన్నారు. మధ్యతరగతి, ధనిక వర్గాల పిల్లలు అరమరికలు లేకుండా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఇదొక కొత్త ప్రయోగం. మధ్య తరగతి, ధనిక వర్గాలు నివాసం వుండే కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో కూడా బాలోత్సవాలు జరపవచ్చుననే గొప్ప అనుభవాన్నిచ్చింది.
అమరావతి బాలోత్సవం
నవంబరు 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 'అమరావతి బాలోత్సవం' నిర్వహించగా 6200 మంది పాల్గొన్నారు. 49 హైస్కూళ్ళలో స్థానికంగా వకృత్వం, వ్యాస రచన, దేశభక్తి గీతాలాపన, పోటీలు పెట్టారు. బహుమతులు పొందిన వారికి నవంబరు 23న తిరిగి జోనల్ స్థాయి పోటీలు అత్యంత విజయవంతంగా జరిగాయి. ఏలూరులో 'హేలాపురి బాలోత్సవం' మూడు సందర్భాలను పురస్కరించుకొని కేవలం పది రోజులలో 116 హైస్కూళ్ళలో కార్యక్రమాలు నిర్వహించింది.
మార్చిలో 'అనంత బాలోత్సవం'లో 62 ఈవెంట్లపై ఉత్సవాలు జరుగగా 9 వేల మంది పాల్గొన్నారు. మానవత, లయన్స్, సీనియర్ సిటిజన్స్ మొదలైన 10 రకాల సంస్థలు సహకారం అందించాయి. బాలలకు అపురూపమైన ఆతిథ్యం ఇచ్చారు. అమరావతి బాలోత్సవం విజయవాడ నాల్గవ పిల్లల పండగను 7500 మందితో జరిపింది. భారత్ నుండి నాసాకు ఎంపికైన యువ ఇంజనీరింగ్ విద్యార్థి డి. జాహ్నవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి బాలల్లో స్ఫూర్తి నింపింది. మార్చి 26, 27 తేదీలలో ఏలూరులో హేలాపురి బాలోత్సవంలో 7 వేల మంది పాల్గొన్నారు.
బాలోత్సవాలు జరుగుతున్న అన్ని ప్రాంతాలలో ఐఎఎస్‌లతో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కవులు, రచయితలు, శాస్త్రీయ నాట్య శిక్షణా సంస్థలు, డాన్స్ అకాడమీలు, సేవా సంస్థలు, లయన్స్, రోటరీ క్లబ్‌లు, సీనియర్ సిటిజన్స్, సేవాతత్పరులు, దాతలు, నగర ప్రముఖులు, వివిధ విద్యా, కళా రంగాలలో నిష్ణాతులు రాజకీయాలకు అతీతంగా వివిధ రూపాలలో సహకారం అందిస్తున్నారు. విద్య అంటే మార్కులు, ర్యాంకులు గాక బాలబాలికలకు అసక్తి ఉన్న అన్ని రకాల విద్యలను నేర్పాలని, సమాజాన్ని అర్థం చేసుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వంగా కలసి ఉండాలనే సందేశాన్ని వక్తలు అందజేయడం ముఖ్యమైన అంశం. సాంస్కృతిక కృషి అంటే బాలలు, యువత, మహిళలలకు వేదికలు ఏర్పరచడమేగాక అన్ని పండుగల లోనూ అంతర్జాతీయ, జాతీయ ముఖ్య దినాలలో పాల్గొనడంగా రూపుదిద్దుకోవాలి.
ఆర్ట్ గ్యాలరీ
మహాకవి గురజాడ 159వ జయంతిని పురస్కరించుకుని గత సెప్టెంబరు 21న విజయవాడలో ''దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా'' గీతం లోని 5 చరణాలపై జాషువా సాంస్కృతిక వేదిక చిత్రలేఖనానికి పిలుపునివ్వగా 218 చిత్రాలు పంపించారు. రైతు ఉద్యమానికి మద్దతుగా మరో 200 చిత్రాలు అందాయి. ఎం.బి. విజ్ఞాన కేంద్రం బాలోత్సవ భవన్‌లో ఆర్ట్ గ్యాలరీకి అవసరమైన స్టాండ్లు తయారు చేయించటమే కాక, చిత్రాలకు అవసరమైన డిజైన్‌తో ఒక హాలును కేటాయించింది. ఈ కృషిలో 20 రకాల ఆర్టిస్టు సంఘాలు భాగస్వాములైనాయి. వారు కూడా మరో 4 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చిత్రకళా రంగంలో హైస్కూలు స్థాయి విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ గ్యాలరీలను డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రదర్శనలు పెట్టగా వేలాదిమంది విద్యార్థులు తిలకిస్తున్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న 34 వివక్షతలపై చిత్రలేఖనంకు పిలుపునివ్వగా 500కు పైగా చిత్రాలు వచ్చాయి. ఇందులో హైస్కూలు స్థాయి బాలబాలికలు 290 చిత్రాలు వేయడం ప్రాధాన్యతగల అంశం. అన్యాయంపై, అణచివేతపై చిన్నారులలో వ్యక్తమైన భావం వెలగట్టలేనిది. అనూహ్య స్పందన వచ్చింది.
మహా శివరాత్రి - సాంస్కృతిక కార్యక్రమాలు
''మహా శివరాత్రి కళా జాగరణ'' ఉత్సవాలు మార్చి 1వ తేదీన విజయవాడ (సింగ్‌నగర్, కృష్ణలంక)లో జరగ్గా 1100 మంది కళాకారులు పాల్గొన్నారు. సాధారణంగా కొన్ని సాంస్కృతిక సంస్థలు జరిపే కార్యక్రమాలు మినహా దళాలు తగ్గుతున్నాయన్న భావన ఉంది. కానీ ప్రజలలో ఉన్న కళారూపాలపై సర్వే చేయగా 45 సాంస్కృతిక దళాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా పటమటలో 150 మంది కోలాటం, జానపదనృత్యాలు నేర్చుకొన్నారు. కుందా వారి కండ్రిగ నుండి మధ్యతరగతి మహిళలు కోలాటంలో పాల్గొనడం విశేషం.
దసరా పండుగ సందర్భంగా అక్టోబరులో పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల, పటమట జడ్.పి బాలికల హైస్కూల్‌లలో దసరా ఉత్సవాలకు జానపద, కూచిపూడి, లఘు నాటికలు, కోలాటాలు మొదలైన 45 రూపాలు ప్రదర్శించగా వందలాది మంది తిలకించారు.
గత డిసెంబరు 1న సెమీ క్రిస్ట్‌మస్, సాంస్కృతిక మేళా ఎంబివికెలో ఘనంగా జరిగింది. అలాగే అదే నెల 15న అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్థంతి పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 'జానపదుల జాతర' పేరున జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాచీన నృత్యమైన తప్పెట గుళ్ళు, కొమ్ముబూరలు, మహిళల కోలాట భజన మొదలైన వైవిధ్యభరిత జానపద నృత్యాలు ప్రదర్శించారు.
తరుణీ తరంగాలు - మహిళల విశాల వేదిక
నలబై పైగా మహిళా సంఘాలు, క్లబ్‌లు, వేదికలు కలసి విజయవాడలో 2017లో వినూత్న ప్రయత్నం చేసి ''తరుణీ తరంగాలు'' అనే ఐక్యవేదికను ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది మార్చి 10, 11 తేదీలలో తరుణీ తరంగాల నాల్గవ ఉత్సవంలో 16 రకాల ఈవెంట్లపై పోటీలు నిర్వహించగా 1500 మంది పాల్గొన్నారు. కాలేజీల లోని యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్లు, రచయితలు, కవులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, సామాజిక సేవకులు మొదలైన ప్రతిభావంతులైన మహిళలను సమీకరించే వేదికగా రూపుదాల్చింది.
ఇవేకాదు. కుల వ్యవస్థకు, మానవుల మధ్య సృష్టించిన కుల మతాల అడ్డుగోడలకు, లింగ వివక్షకు వ్యతిరేకంగా నిలచిన సంఘసంస్కర్తల వర్ధంతులు, జయంతులు సంవత్సరం పొడవునా జరిపే విధంగా ప్రతి సాంస్కృతిక సంస్థ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ విధమైన కృషి ప్రత్యామ్నాయ సంస్కృతికి దారులు వేస్తుందనడంలో సందేహం లేదు.

పి. మురళీకృష్ణ / వ్యాసకర్త :ఎం.బి.విజ్ఞాన కేంద్రం మేనేజ్‌మెంట్ కమిటీ కార్యదర్శి /










