Dec 10,2021 07:12

   'దేశంలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు ఆలోచనే లేదు...' అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభలో ఇచ్చిన జవాబుతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (విభజన) చట్టంలోని ఒక కీలకాంశాన్ని తుంగలో తొక్కినట్టైంది. విశాఖపట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజల చిరకాల డిమాండ్‌. సమైక్య రాష్ట్ర విభజన సమయంలో అది మరింత బలంగా ముందుకొచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. జోన్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారి (ఒఎస్‌డి)ని నియమించింది. ఆయన వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చినప్పటికీ ఇంకా కేంద్రం చర్యలు తీసుకోలేదు. అందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అదే లోక్‌సభలో చెప్పారు. ఇంతలోనే ఇలా మాట మార్చారు. ఆనాటి రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ 2019 ఫిబ్రవరిలో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆ మార్చిలో జరిగిన ఎన్నికల సభలో సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంత పెద్దవారే జోన్‌ ప్రకటించారు కనుక అది ఆలస్యంగానైనా ఆచరణ రూపం దాలుస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. కాని, బుధవారంనాడు మంత్రి సమాధానంలో దేశం లోని 17 జోన్ల పేర్లలో విశాఖ లేదు. దీంతో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు విషయంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమైంది. ప్రజలను మోసగించడం తన సహజ నైజమని తేలిపోయింది.
    విశాఖ జోన్‌ ఏర్పాటు చేస్తామంటూనే దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించే కీలకమైన వాల్తేరు డివిజన్‌లోని అత్యధిక భాగాన్ని ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌కు బదలాయిస్తామని చెప్పడం కేంద్ర ప్రభుత్వ వంచనకు పునాది. ఒకవేళ ఏర్పాటు చేసినా విశాఖ జోన్‌కు గుండెకాయ లేకుండా చేయాలన్న కుట్ర కూడా అందులో దాగివుంది. అటవీ సంపద, ఖనిజాలు పుష్కలంగా ఉండడంతోపాటు రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరముంది. స్టీల్‌ ప్లాంటు, రెండు మేజర్‌ పోర్టులు, తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయం అక్కడే ఉన్నాయి. విశాఖపట్నం రాష్ట్రంలో అతి పెద్ద నగరం. ఎగుమతి దిగుమతులకు, అంతర్గత రవాణాకు విశాఖపట్నం కీలకమైన కేంద్రం. రైల్వే నెట్‌వర్క్‌ లోనూ కొల్‌కతా-చెన్నైల మధ్య అది ఒక ముఖ్య కూడలి కూడా. రాష్ట్ర అభివృద్ధికి రవాణా సౌకర్యాల విస్తరణ ఎంతో ముఖ్యమైనది. పారిశ్రామికోత్పత్తులను ఎగుమతి చేయడానికి, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులను దిగుమతి చేసుకోవడానికి పోర్టులతో కనెక్టివిటీ ఎంతగానో తోడ్పడుతుంది. వ్యవసాయానికి ముఖ్యంగా సకాలంలో ఎరువుల రవాణాకు దోహదపడుతుంది. ప్రజా రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేక జోన్‌ ఏర్పాటైతే నెట్‌వర్క్‌ విస్తరణకు, ఆయా సమయాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికీ అవకాశం ఉంటుంది. అందుకనే ఉమ్మడి రాష్ట్రం లోనూ విశాఖ జోన్‌ ఏర్పాటు డిమాండ్‌తో ప్రజలు ఉద్యమించారు. ఇప్పటికీ ప్రజల ఆకాంక్ష బలంగానే ఉంది.
    ప్రత్యేక హోదాను ఎగ్గొట్టిన బిజెపి కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజికి తిలోదకాలిచ్చింది. కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లకు అతీ గతీ లేదు. లోటు నిధుల భర్తీతో సహా విభజన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు చిలకరించి పోయారు తప్ప నిర్మాణానికి అవసరమైన నిధులివ్వలేదు. రాష్ట్ర ప్రజలను మోసగించడం కేంద్ర ప్రభుత్వానికి నిత్యకృత్యమైపోయింది. అయినా బిజెపి నేతలు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెబుతూనే ఉండడం దారుణం. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం తప్ప కేంద్ర ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టడం, ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుతో సహా విభజన చట్టంలోనూ, ఆ సందర్భంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి, సాధించుకోవడమే రాష్ట్ర ప్రజల కర్తవ్యం. అందుకు అవసరమైన చొరవ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాగా నిర్మాణాత్మక సహకారం అందించడం ప్రతిపక్షాల వంతుగా ఉండాలి. ఏకోన్ముఖంగా ఉద్యమించి రాష్ట్ర డిమాండ్లను సాధించుకోవాలి.