Feb 24,2023 19:04

మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ ఆర్‌జెడి పద్మజ

- ఐసిడిఎస్‌ ఆర్‌జెడి పద్మజ
ప్రజాశక్తి-పీలేరు : సమాజంలో ఎవరూ ఆడపిల్లలని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ వారిని మంచి విద్యా వంతులుగా తీర్చిదిద్దేలా అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లిదండ్రులను చైతన్య పరచాలని ఐసిడిఎస్‌ ఆర్‌జెడి పద్మజ తెలిపారు. స్థానిక సిఎల్‌ఆర్‌సి సమావేశ మందిరంలో పీలేరు, కెవి పల్లి మండలాల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్లిలను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని సూచించారు. గర్భవతులకు వైఎస్‌ఆర్‌ కిట్లను అందజేస్తూ వారిలో రక్తహీనత సమస్యను అధిగమించడానికి కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా ఆడపిల్ల సంతతి తగ్గకుండా తల్లులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా ఐసిడిఎస్‌ ఇన్‌ఛార్జి పీడీ ధనలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని తొమ్మిది ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2,275 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని, వాటి ద్వారా 0-6 ఏళ్ళ మధ్య వయస్సు చిన్నారులు 1,09,708 మంది, 10,575 మంది గర్భవతులు, 10,752 మంది బాలింతలకు పౌష్టికాహారం అందుతోందని పేర్కొన్నారు. తమ కేంద్రాల్లోని 1,09,708 మంది చిన్నారుల్లో 35 వేల మంది పిల్లలకు 32 శాతం ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తైందని, మిగిలిన వారిని కూడా మార్చి 15 లోగా ఆధార్‌ అనుసంధానం పనులను 100 శాతం పూర్తి చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. కేంద్రాలకు సరఫరా అవుతున్న బియ్యం, పప్పు, నూనె, పాలు, వైఎస్‌ఆర్‌ కిట్లు, కోడుగ్రుడ్ల నాణ్యత, పరిమాణం వాటి గడువు తేదీలను పరిశీలించి తీసుకోవాలని చెప్పారు. కేంద్రాలకు సరఫరా చేసే వస్తువులు, పదార్థాల్లో లోపం ఉంటే వాటిని వెనక్కు పంపి ఫిర్యాదులను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సమావేశంలో డిఎల్‌పిఒ సిహెచ్‌ నారాయణ, చిన్నగొట్టిగల్లు ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ సిడిపిఒ సి.రాజమ్మ, సూపర్‌వైజర్లు స్వరూప, అక్కయ్యమ్మ, ఉమ, స్వర్ణ, శాంత, సర్తాజ్‌, అన్నపూర్ణ, వైఎసÊఆర్‌టియుసి అనుబంధ సంఘమైన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ చిన్నమ్మ, జిల్లా అధ్యక్షులు చిన్నయల్లప్ప, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.