ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 1950 నవంబరు18న జార్ఖండ్‌లో జన్మించిన అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని బెంగాలీ బైద్య కుటుంబంలో పెరిగారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఫిజిక్స్ ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1981లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి పట్టా పొందారు. 1985లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్‌లో చేరడానికి ముందు సేన్ సస్సెక్స్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎసెక్స్ అంతర్జాతీయ విద్యా సంస్థల్లో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. జెఎన్‌యులో కృష్ణ భరద్వాజ్, ప్రభాత్ పట్నాయక్, సి.పి చంద్రశేఖర్, అమిత్ భాదురి, జయతి ఘోష్ సహకారంతో భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయనానికి కేంద్రంగా ఎకనమిక్స్ డిపార్టుమెంట్‌ను తీర్చిదిద్దారు. సేన్ తన బోధన, పరిశోధనతో పాటు, విధానాల రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించాడు. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఆయనను వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమీషన్ (సిఎసిపి) చైర్మన్‌గా నియమించింది. 2000 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. అభిజిత్ చేసిన సిఫారసుల్లో సి2తో కలిపి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం, అర్హులైనవారందరికీ బియ్యం, గోధుమలతో సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ని ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి. 2009లో ఆయనను జాతీయ, ఆర్థిక విషయాలపై ఉన్నత విధాన నిర్ణాయక మండలి సభ్యునిగా నియుక్తులై అయిదేళ్లపాటు ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు... దేశంలో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ని ఏర్పాటు చేసింది. 2014లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చిన తరువాత ''దీర్ఘకాలిక ధాన్యం విధానం'' అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి టాస్క్ టీమ్‌కు సేన్ నాయకత్వం వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సేన్ బలమైన మద్దతుదారుగా నిలిచారు.
అంతర్జాతీయ సంస్థలైన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (న్యూయార్క్), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఒ), జెనీవా, ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ( రోమ్), ఒఈసిడి డెవలప్‌మెంట్ సెంటర్ (పారిస్), యుఎన్ యూనివర్శిటీ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (హెల్సింకి), ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (రోమ్), ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (మనీలా), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌కు సలహాదారుగా ఉన్నారు. ఆయన ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై 30 గ్రంథాలు రచించారు.
2010లో ప్రజాసేవకుగానూ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. వామపక్ష ప్రభుత్వాల పాలనలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపురలో రాష్ట్ర ప్రణాళికా బోర్డుల సభ్యుడుగా, వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్, గ్రామీణ రుణాలపై నిపుణుల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఏచూరి తదితరుల సంతాపం
అభిజిత్ సేన్ మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప ప్రజా ఆర్థిక వేత్త అని వారు కొనియాడారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ''ప్రొఫెసర్ అభిజిత్ సేన్ తన తనువు, హృదయం రెండింటినీ సరైన స్థానంలో ఉంచిన గొప్ప ఆర్థికవేత్త అని కొనియాడారు. ఆయన కృషి, జోక్యం అనేక కుటుంబాలకు మేలు చేకూర్చింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఆయన సేవలు ఇదివరకెన్నటికన్నా మరింత ఎక్కువ అవసరం ఉంది..ఈ స్థితిలో ఆయన మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని ఏచూరి పేర్కొన్నారు.
'మాణిక్' అని ముద్దుగా పిలుచుకునే సేన్ ''ఆహార హక్కు ప్రచారంతో సహా అనేక ఉద్యమాలు, ప్రచారాలకు స్నేహితుడు'' అని ప్రముఖ ఆహార హక్కుల కార్యకర్త బిరాజ్ పట్నాయక్ పేర్కొన్నారు.
సుదీర్ఘమైన కెరీర్‌లో విధాన రూపకల్పనలో శ్రామిక పేదల ప్రయోజనాలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకుని, ప్రగతిశీల విలువలను నిలబెట్టిన అద్భుతమైన ఆర్థికవేత్త అభిజిత్ సేన్ అని సిపిఎం తన సంతాప సందేశంలో పేర్కొంది.
''అభిజిత్ సేన్ పేద, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని నీతి అయోగ్ సభ్యులు రమేష్ చంద్ పేర్కొన్నారు. చేశారు.
వ్యవసాయ ఆర్థిక వేత్త అభిజిత్ మరణం విద్యారంగానికే కాకుండా యావత్ దేశానికే తీరని లోటు. అని కేరళముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రొఫెసర్ అభిజిత్ సేన్ ప్రగతిశీల ఉద్యమాలకు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచేవారని, కేరళలో పీపుల్స్ ప్లాన్ రూపకల్పనలోను ఆయన కీలక భూమిక వహించారని అన్నారు. ఆయన భార్య ప్రొఫెసర్ జయతి గోష్, కుమార్తె జాహ్నవికి ప్రగాఢ సానుభూతిని విజయన్ తెలియజేశారు.
ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ దావలే, ప్రొఫెసర్ ఆర్.రామ్‌కుమార్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ప్రొఫెసర్ అసిత్ మొహంతి, ప్రొఫెసర్ ప్రాచీ శ్రీవాస్తవ, సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సూర్యకాంత్ మిశ్రా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రి టి ఎస్ సింగ్‌దేయో, గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మెవాని తదితరులు సంతాపం తెలిపారు. ఎఐఎడబ్ల్యుయు నాయకులు బి వెంకట్, ఎఐకెఎస్ లెఫ్ట్‌వర్డ్ బుక్స్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, అగ్రేరియన్ సౌత్ నెట్‌వర్క్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, విద్యార్థి, యువజన, వివిధ ప్రజా సంఘాలు సంతాపం తెలిపాయి.










