ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలో పరిమితులను, సవాళ్లును అధిగమించి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నామని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఎఐకెఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్. బాలగోపాల్ అన్నారు. కేరళ ఆర్థిక మంత్రిగా తొలిసారి ఢిల్లీ పర్యాటనకు వచ్చిన బాలగోపాల్‌కు ఎఐకెఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎఐకెఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేరళ అభివృద్ధిలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి హక్కులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అన్నదాతల సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించామన్నారు. కార్పొరేట్ కంపెనీల వలలో పడకుండా రైతులను కాపాడుకుంటామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వి.శివదాసన్, ఎఐకెఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మొల్లా, కోశాధికారి కఅష్ణ ప్రసాద్, సునీత్ చోప్రా (ఎఐఎడబ్ల్యుయు), మరియం దావలే (ఐద్వా), నితీష్ కుమార్, (ఎస్‌ఎఫ్‌ఐ), మురళీధరన్ (ఎన్ పిఆర్ డి) పాల్గొన్నారు.










