- బ్రెయిన్ డెడ్‌తో అవయవదానం
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : తాను మరణిస్తూ అవయవ దానం ద్వారా మరో నలుగురు జీవితాల్లో ఓ విద్యార్థి వెలుగు నింపారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. విద్యార్థి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన కట్టా కృష్ణ (18) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 23న బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో, ఆయన తలకు బలమైన గాయం కావడంతో గుంటూరు రమేష్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. వైద్యులు రక్షించే ప్రయత్నాలు ఫలించక కృష్ణ బ్రెయిన్ డెడ్ అయ్యారు. మృతుడి తల్లిదండ్రులు కట్ట రాజు, మల్లేశ్వరి, బంధువులకు గుంటూరు రమేష్ హాస్పిటల్ వారు అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో, కృష్ణకు చెందిన గుండె, లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. ఇతరులకు అవయవాలను అమర్చేందుకు రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. గుండెను హెలికాప్టర్ ద్వారా తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కు తరలించారు. కాలేయాన్ని వైజాగ్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు, మరొక కిడ్నీని గుంటూరులోని రమేష్ హాస్పల్‌కు తరలించి అవసరమైన వారికి అమర్చారు. ఈ సందర్భంగా గుంటూరు పోలీసు పేరేడ్ గ్రౌండ్స్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసు అధికారులు పూర్తి సహాయసహకారాలు అందించారు. కృష్ణ తల్లిదండ్రులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయస్సులోనే తమ కుమారుడు నలుగురులో మంచిపేరు తెచ్చుకోవాలని పరితపించేవాడని, మృతి చెందిన తరువాత ఇలా నలుగురికి జీవితాల్లో వెలుగులు నింపి చిరంజీవిగా మిగిలిపోయాడని తల్లిదండ్రులు భావోద్వేగంతో పేర్కొన్నారు.










