సమాజానికి నిరంతరం ఏదో మంచి చేయాలన్న సంకల్పమే వారి ముగ్గురిని స్నేహితులను చేసింది. వేర్వేరు ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా ఒకే లక్ష్యం కావడంతో వారిని ఒక దగ్గరకు చేర్చింది. అదే అనాథ వృద్ధుల కోసం ఆశ్రమం నిర్వహించేలా చేసింది. దాని కోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి అనుకున్నది సాధించారు. పాతికేళ్లుగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆశ్రమాన్ని నడుపుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన లలితా దేవి శర్మ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్, లక్ష్మీ నరసమ్మ బయో-స్టాటిస్టిషియన్, ఇందిరా దేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేశారు. ముప్పై ఏళ్ల క్రితం వీరు ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గన్నారు. వీరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటే కావడంతో వీరి మధ్య స్నేహబంధం ఏర్పంది. అలా ఈ ముగ్గురూ కలిసి పాప రైస్ మిల్ జంక్షన్ సమీపంలో ఉచిత విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. రోజూ ఉద్యోగ బాధ్యతలు ముగిసిన వెంటనే ఇక్కడకు చేరుకుని చదువురాని మహిళలకు, వృద్ధులకు చదువు చెప్పారు. అయితే దీని కోసం వీరు కొంత శ్రమపడ్డారు. 'ఈ వయస్సులో మాకు చదువు ఎందుకు? 'ఇప్పుడు చదువుకుని ఏం ఉద్దరించాలి' అంటూ మహిళలు వచ్చేవారు కాదు. అయినా, లలితాదేవి, నరసమ్మ వారికి నచ్చజెప్పి విద్యాకేంద్రానికి తీసుకువచ్చేవారు. అక్షరాలు, అంకెలు చెప్పి వారిని సంతకం చేసే స్థాయికి తీసుకువచ్చారు. సంవత్సరం పాటు బాగా నడిచింది. పనుల రీత్యా చదువుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ కేంద్రాన్ని మూసివేశారు.
పేదవాళ్లకు ఏదైనా చేయాలన్న ఆలోచన వారిని మరో సేవా కార్యక్రమానికి పురిగొల్పింది. ప్రతిరోజూ బిక్షాటన చేస్తున్న వృద్ధులను పిలిచి అన్నం పెట్టేవారు. ఈ క్రమంలో అనాధ వృద్ధులకు ఆశ్రమం కల్పించాలన్న ఆలోచన కలిగింది. పిల్లలు లేని, వృద్ధ పేద మహిళలు, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన వారి కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఉడతా భక్తిగా సాయం అందించాలన్న ఉద్దేశంతో వారి స్వంత డబ్బులతో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని ఉడతను చిహ్నంగా పెట్టుకొని ఓ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు వచ్చిన ముగ్గురు అనాధలకు రోజూ అన్నం పెట్టారు. మరింత మందికి ఆశ్రమం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. చాలా నెలలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఎటువంటి మద్దతు లేకపోవడంతో స్వాతంత్య్ర సమరయోధుడు నరహరి పద్మనాభయ్య భార్య విమలమ్మను ఆశ్రయించారు. ఆమెకు పిల్లలు లేరు. భర్త చనిపోయారు. ఈ ముగ్గురు స్నేహితులు చేస్తున్న సేవ కార్యక్రమం గురించి తెలిసి ఆమె ఆనందించారు. ఒంగోలులోని లాయరుపేటలో ఉన్న ఆమె ఇంటిని ఉచితంగా ఆశ్రమానికి రాసి ఇచ్చారు.
జోలెపట్టి.. ఊరురా తిరిగి
ముగ్గురు స్నేహితులూ తమ నగలను బ్యాంకుల్లో పెట్టి ఇంటిని బాగు చేయించారు. దాచుకున్న డబ్బుతో రంగులు వేయించారు. 'నరహరి విమలమ్మ పద్మనాభయ్య సేవాశ్రమం' స్థాపించారు. కాని అవసరమైన సరుకులు, ధాన్యం కోసం లలితాదేవి, లక్ష్మి నరసమ్మ, ఇందిరా దేవి జోలె పట్టి చుట్టుపక్కల పల్లెటూళ్లలో తిరిగారు. రోజంతా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, సాయంత్రం వేళల్లో ఊరురా తిరిగారు. వీరి గురించి తెలిసిన వారంతా ఆర్థికసాయం అందించారు. కొంతమంది రైతులు మినుములు, కందులు, బియ్యం, మిర్చి, శనగలు ఇచ్చి సాయపడ్డారు. తోటి ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి నెలకు సరిపడే కూరగాయలు తెచ్చి ఇచ్చేవారు. ఒంగోలు పట్టణంలో కొంతమంది ట్రస్టు సభ్యులను ఆశ్రయించారు. వారు కూడా ప్రతినెలా రూ.500, రూ.1000 చొప్పున ఇప్పటికీ ఇస్తున్నారు.
ఒకే కుటుంబంలా ...
ఆశ్రమంలో ఎప్పుడూ 30 నుంచి 40 మంది వరకు వృద్ధులు ఉంటారు. నిస్సహాయ స్థితిలో ఎవరైనా తమ తల్లిదండ్రుల్ని ఇక్కడ చేర్చితే వారి నుంచి నామమాత్రంగా రూ.300 తీసుకుని వారిని చేర్చుకుంటారు. ఆశ్రమంలోని పెద్దలు వంటగదిలోకి వెళ్లి టీ, పాలు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇష్టమైన కూరలు వండుకుని కలిసిమెలిసి ఉంటారు. పండగలు, పుట్టినరోజు నాడు తప్పకుండా స్పెషల్ ఐటమ్స్ వండుకుని తింటుంటారు. రామచంద్ర మిషన్ నుంచి ఒకరు ఉదయం పూట వచ్చి యోగా, ధ్యానం చేయిస్తారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే వారిని అంటిపెట్టుకుని ఉన్న భవాని అనే మహిళ ఆసుపత్రికి తీసుకుని వెళుతుంది. వారికి సపర్యలు చేస్తూ ఆశ్రమంలోనే ఉంటుంది. ఆశ్రమంలో 80 నుంచి 90 ఏళ్ల వయస్సు వారు ఎక్కువమంది ఉన్నారు. వందేళ్లకు పైబడిన వారు నలుగురు ఉండేవారు.
స్నేహితురాలు మరణించినా ...
పదకొండేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో ఇందిరాదేవి మృతి చెందారు. ఆమె మరణం మిగిలిన ఇద్దరిని కృంగదీసింది. తోడబుట్టిన అక్కచెల్లెళ్ల కన్నా మిన్నగా ముగ్గురు కలిసిమెలిసి అన్ని పనులు చేసేవారు. ఇందిరాదేవి చెప్పే స్ఫూర్తివంతమైన మాటలను గుర్తుచేసుకుంటూ ఆశ్రమంలో ఆమెలేని లోటు తెలియకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు లలితాదేవి, లక్ష్మినరసమ్మ. వీరు ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు. లలితాదేవికి రెండుసార్లు కరోనా సోకింది. గుండె ఆపరేషన్ కోసం హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయినా ఫోన్ ద్వారా ఆశ్రమంలోని వృద్ధమహిళల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వారి అలనాపాలనా చూస్తున్నారు. ప్రభుత్వ సహాయం లేదు. విదేశీ ఫండ్స్ అంతకన్నా లేవు. అయినా పాతికేళ్లుగా పట్టుసడలకుండా వృద్ధాశ్రమాన్ని నిరాటంకంగా నడుపుతున్నారు.
ఇద్దరు బిడ్డలను చదివించారు : భవాని, కేర్ టేకర్
మాది విజయవాడ. నాకు ఇద్దరు మగపిల్లలు. పిల్లల్ని చదివించలేక ఇంటి దగ్గర ఉంచానని తెలుసుకుని నన్ను లలితమ్మ ఒంగోలు పిలిపించారు. వారికి ఫీజులు కట్టి, మంచి చదువు చెప్పించారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలిసిన ఆమె నన్ను ఆశ్రమంలో ఉన్న వృద్ధులను చూసుకోమని చెప్పారు. ఇంతమందికి అన్నం వండిపెట్టడంలో ఉన్న తృప్తి నాకు ఎందులోనూ కలగలేదు. అందుకే ఇరవై రెండేళ్లగా ఆశ్రమంలో కేర్‌టేకర్‌గా ఉంటున్నా. వయస్సు రీత్యా చాలామందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వారిని కనిపెట్టుకుని వెంటనే వైద్యశాలకు తీసుకువెళతా. వీరికి ఎలాంటి సమస్య రాకుండా లలితమ్మ, లక్ష్మినరసమ్మ చూసుకుంటున్నారు.











