Mar 06,2023 15:09

ప్రజాశక్తి - కనగానపల్లి (సత్యసాయి జిల్లా) : విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి స్టేషన్‌ ఎదుట సోమవారం చోటుచేసుకుంది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల నాలుగున కనగానపల్లి మండలం మద్దలచెరువు గ్రామంలో రామాంజనేయులుకు చెందిన పది ట్రాక్టర్ల వేరుశనగవామి అగ్నికి ఆహుతి అయ్యింది. దీనిపై బాధిత రైతు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితుడిగా అదే గ్రామానికి చెందిన మధును ఆదివారం పోలీసులు విచారించారు. మళ్లీ సోమవారం స్టేషన్‌కు రావాలని చెప్పారు. సోమవారం ఉదయం మధు స్టేషన్‌ వద్దకు రాగానే అప్పటికే తనతోపాటు తెచ్చుకున్న పురుగుమందును తాగాడు. పోలీసులు గమనించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫిర్యాదుదారుని అనుమానం మేరకే తాము మధును స్టేషన్‌కు రావాలని చెప్పామని ఎస్‌ఐ హనుమంతరెడ్డి తెలిపారు.