Oct 02,2022 08:13

వరలక్ష్మి శరత్‌కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెగిటివ్‌ షెడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తూ, తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మాస్‌ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన క్రాక్‌ సినిమాలో పూర్తిగా నెగిటివ్‌ రోల్‌తో మెప్పించారు. అలాగే 'నాంది' సినిమాలో న్యాయవాది పాత్రలో నటించి, ప్రశంసలు అందుకున్నారు. భాషతో సంబంధం లేకుండా ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా 'శబరి' అనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో తల్లి పాత్రలో నటిస్తున్నారు వరలక్ష్మి. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని విశేషాలు..!
వరలక్ష్మి శరత్‌కుమార్‌... కోలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయక్కర్లేని పేరు. దక్షిణాది సినిమా ఇండిస్టీలో తన వైవిధ్యమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్రనైనా తన నటనతో మెప్పించేస్తారు. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ వారసురాలైన ఆమె శరత్‌కుమార్‌ బ్రాండ్‌ను పెద్దగా ఉపయోగించుకోకుండానే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో శింబుకు జంటగా 'పోడాపోడి' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈమె, నటిగా దశాబ్దాన్ని పూర్తిచేసుకున్నారు.
తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై, పుష్కర్‌, గాయత్రి దర్శకత్వంలో 'విక్రమ్‌ వేదా' వంటి హిట్‌ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా నటించిన 'సండైక్కోళి-2' చిత్రంతో ప్రతినాయకిగా అవతారమెత్తారు. అదేవిధంగా విజరు కథానాయకుడుగా నటించిన 'సర్కార్‌' చిత్రంలోనూ విలనిజాన్ని ప్రదర్శించారు.

varalakshmi


ఆపై నాయకి, ప్రతినాయకి అన్న భేదం లేకుండా వైవిధ్యం అనిపించిన పాత్రలకు ఓకే చెప్పేసుకుని, నటిస్తూ ఆల్‌రౌండర్‌గా మారిపోయారు. అదే విధంగా ఒక్క తమిళ భాషలోనే కాకుండా తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగానూ పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'పాంబన్‌, గ్రంథాలు పిరందాళ్‌ పరాశక్తి, కలర్స్‌, యశోద, శబరి'తో పాటు తెలుగులో బాలకృష్ణ చిత్రంలోనూ నటిస్తున్నారు.
అది నా చిరకాల కోరిక..
కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ హాస్యభరిత కథా చిత్రంలో నటించాలన్నది తన చిరకాల కోరిక అన్నారు. అయితే తనకు అలాంటి పాత్రలో నటించే అవకాశాలు రావడం లేదని, అన్నీ ప్రతినాయకి పాత్రలే వస్తున్నాయని, 'కాబట్టి ఎవరైనా కామెడీ కథా చిత్రాల్లో నటించే అవకాశం చెప్పండి ప్లీజ్‌!' అని నటి వరలక్ష్మి అంటున్నారు.
ఏది సంతోషాన్ని ఇస్తే అదే చెయ్యి...
ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు చేరువగా ఉంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటారు. తాజాగా ఓ పోస్ట్‌తో వరలక్ష్మి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఆ పోస్టుకు అందమైన క్యాప్షన్‌ను జత చేశారు.
'కష్టం నిజం.. సవాలు నిజం.. కానీ మీరే లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో.. అది చేరకుండా మిమ్మల్ని ఏదీ ఆపలేదు. మీరు ఎవరో.. మీరెలా ఉండాలో.. ఎవరూ మీకు చెప్పలేరు. నిన్ను నువ్వు ఛాలెంజ్‌ చేసుకో. మిమ్మల్ని మీరు పోటీగా చేసుకుంటే.. మీరు సాధించిన దాంతో ఆశ్చర్యపోవడం ఖాయం. నేను చూపించాలనుకున్న స్లిమ్‌ లుక్‌ వెనుక నాలుగు నెలల కష్టం ఉంది. మీకు ఏది సంతోషమనిపిస్తే అది చేయండి.. ఇతరులకు సంతోషాన్ని కలిగించే పనులు చేయకండి. ఎందుకంటే మీరేది చేయాలో.. ఏం చేయకూడదో ఎవరూ చెప్పరు. మీ నమ్మకం, విశ్వాసమే.. మీ ఆయుధం.. మిమ్మల్ని మీరు నమ్మండి..' అంటూ స్పూర్తిని కలిగించే సందేశాన్ని పోస్ట్‌ చేశారు.
వారికి అండగా నడవాలనేదే లక్ష్యం..
కాగా డైరెక్టర్‌ కావాలనేది నా లక్ష్యం కాదని.. పాలిటిక్స్‌లోకి వచ్చి, మహిళలకు అండగా నిలబడటమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఓ మంచి చేయాలి అంటే ఇలా జీవితంలో ముందుకు వెళ్లడానికి యాంబిషన్‌ ఉండాలి. మహిళలు ఒకరిపై ఏవిషయంలోనూ ఆధారపడకూడదనేది నా అభిప్రాయం.
అక్కడికన్నా ఇక్కడే ఆదరణ ఎక్కువ..
'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌'తో తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి 'క్రాక్‌', 'నాంది' తో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది ఆరంభంలోనే తెలుగులో రెండు విజయాలు సొంతం చేసుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. 'నాంది' విజయం సందర్భంగా స్పందిస్తూ.. 'నటిగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి పదేళ్లవుతోంది. తెలుగులో లభించినంత ఆదరణ కోలీవుడ్‌లో రాలేదు. నా సినిమాలు చూసి, తెలుగులో మీకు మంచి అవకాశాలొస్తాయని చాలామంది చెప్పేవాళ్లు. ఇక్కడికి వచ్చాక అది నిజమని అర్థమైంది. ఆ మధ్య చెన్నరుకి వెళ్లిన సమయంలో అమ్మతో కలిసి 'నాంది' చిత్రాన్ని వీక్షించాను. ఆ సినిమా చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను కథానాయికగా నటించిన 'తారై తప్పట్టై' అనే తమిళ చిత్రం తర్వాత మా అమ్మ కన్నీళ్లు పెట్టుకున్న చిత్రమిదే' అని పేర్కొన్నారు.

varalakshmi

పేరు : వరలక్ష్మి శరత్‌కుమార్‌
ఇతరపేర్లు : వరు
పుట్టిన తేదీ : మార్చి 5, 1985
పుట్టిన ప్రాంతం : చెన్నయ్
చదువు : ఎంబిఎ
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌
తల్లిదండ్రులు : రామనాథన్‌ శరత్‌కుమార్‌, చాయా శరత్‌కుమార్‌
తోబుట్టువులు : రాహుల్‌, పూజా శరత్‌కుమార్‌