ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అదానీ, శ్రీ షిర్డీ సాయి సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు గిరిజనుల, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం ఫణంగా పెడుతోందని విమర్శలు ముసురుకుంటున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సర్కార్ ముందుకే సాగుతోంది. ప్రయివేట్ సంస్థలకు అడ్డంకులు తొలగించడానికి కార్యాచరణ రూపొందించిందని పలువురు అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ఐదో షెడ్యూల్‌లోని చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పిఎస్‌పి) ఏర్పాటుతో తాండవ జలాశయానికి వచ్చే నీటి వనరులు దెబ్బతిననున్నాయి. ఈ నేపథ్యంలో ఏలేరు, తాండవ కాలువల అనుసంధాన ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకుతెచ్చింది. ఎర్రవరం వద్ద పిఎస్‌పి ఏర్పాటు కాకముందే తాండవ ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు సాగునీటి అనుసంధాన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. తాండవ ఆయకట్టుకు వచ్చే ముప్పును వివరిస్తూ, ఎర్రవరం పిఎస్‌పిపై అనేక అభ్యంతరాలు లేవనెత్తుతూ, కొన్ని సూచనలతో నీటిపారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. జలాశయానికి వచ్చే ప్రవాహాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఏలేరు, తాండవ అనుసంధాన ప్రాజెక్టుకు 2021 మార్చి 19న ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ జిఒ 93 విడుదల చేసింది. రూ.470.05 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబరులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పిసిపి ఏర్పాటయ్యే నాటికి అనుసంధాన ప్రాజెక్టు పూర్తి కాకపోతే తాండవ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడనుంది. ఈలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న యోచనలో ప్రభుత్వముంది. ఎర్రవరం వద్ద పిఎస్‌పి ఏర్పాటును శ్రీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు, అనంతగిరి మండలం పెదకోట, రైవాడ జలాశయంపై పిఎస్‌పి ఏర్పాటును అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఇజిఇఎల్)కు ప్రభుత్వం అప్పగించింది. తాండవ జలాశయం కింద 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆరు లిఫ్ట్‌లు (అనకాపల్లి జిల్లాలో మూడు, కాకినాడ జిల్లాలో మూడు) ఏర్పాటు చేయడం ద్వారా కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, పత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాల్లో, అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాల్లో ఆయకట్టు స్థిరీకరణ, కాకినాడ జిల్లాలోని రౌతులపూడి, పత్తిపాడు, శంఖవరం మండలాల్లో కొత్తగా 5,600 ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభించనుందని ఏలేరు కాలువ, తాండవ అనుసంధాన ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తాండవ జలాశయానికి నీటి సమస్య తొలగుతుందని చెబుతున్నారు.










