Jul 16,2023 19:00

వెంకటయ్యపాలెం: కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వైసిపిలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మంత్రిపై బోస్‌ వర్గం తిరుగుబావుటా ఎగరవేసింది. ఆదివారం వెంకటయ్య పాలెంలో ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబోస్‌పై అభిమానంతో మంత్రి వేణును గెలిపించామని, అలాంటిది తమ మీదే రౌడీషీట్‌ తెరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని, వైసిపిను మంత్రి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.శెట్టిబలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ అణగదొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈసారి ఆయనకు టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబోస్‌ కుటుంబానికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైసిపి టికెట్‌ ఇవ్వకపోయినా, బోస్‌ కుమారుడిని గెలిపిస్తామని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని, డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 26న అమలాపురంలో సీఎంను కలిసి పరిస్థితులు వివరిస్తామని చంద్రబోస్‌ అనుచరులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్‌కు వైసిపి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.