Oct 01,2023 21:46

-సానుభూతి పవనాలపై ఆరా?
-ప్రయివేటు ఏజెన్సీకి బాధ్యతలు
-ఎంపి విజయసాయి పర్యవేక్షణ!
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అంశాల వారీగా సర్వేలు చేయించడంపై వైసిపి అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా రాష్ట్ర పోలీసు నిఘా విభాగం, పార్టీపరంగా 'ఐ'ప్యాక్‌ బృందాలు సర్వేలు చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు నివేదికలు ఇస్తున్నాయి. తాజాగా థర్డ్‌ పార్టీ బృందాలతో సర్వే చేయించి వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గత నెల 9న నంద్యాలలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, అనంతర పరిణామాలపై నియోజకవర్గాల వారీగా సర్వే చేయిస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు తరువాత ప్రజల్లో సానుభూతి ఉందా? అనే అంశంపై దృష్టి సారించారు. ఈ మేరకు ఏడు ప్రశ్నలతో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ వ్యవహారంలో చంద్రబాబు అవినీతి చేసినట్టు భావిస్తున్నారా? ఆయన అరెస్టు సబబేనా? ప్రభుత్వం తొందరపడిందని అనుకుంటున్నారా? ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే ప్రజల్లో టిడిపికి సానుభూతి వస్తుందని భావిస్తున్నారా? సిఎం జగన్‌ చేసిన నిర్ణయం సరైనదేనా? వివిధ కుంభకోణాల్లో లోకేష్‌ పాత్ర? వైసిపి పాలనపై మీ అభిప్రాయం ఇలా... పలు ప్రశ్నలతో ఒక ప్రయివేటు సంస్థ ద్వారా సర్వే చేపట్టినట్టు తెలిసింది. ఇందుకు వైసిపికి సానుభూతిపరులుగా ఉన్న వారు కాకుండా గ్రామాలు, పట్టణాల్లో తటస్తులుగా ఉన్న వారిని ఎక్కువగా ఎంపిక చేసుకోవాలని సర్వే నిర్వాహకులకు వైసిపి నాయకత్వం సూచించింది. ఇందుకోసం ఆయా పట్టణాలు, మండలాల్లో స్థానికంగా తెలిసిన వారిని సర్వే బృందంలో సభ్యులుగా నియమించుకుంటున్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక బృందం సర్వేలో పాల్గంటోంది. సర్వేలో వివిధ తరగతుల ప్రజలను భాగస్వామ్యం చేసి వారి అభిప్రాయాలు రాబట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలతోపాటు ఇతర సామాజిక తరగతుల్లోని తటస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి నమూనాగా 300 మందిని ఎంపిక చేసుకోవాలని, ఇందులో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు 50 శాతం, ఇతరులు మరో 50 శాతం ఉండేలా చూస్తున్నారు. ఈ సర్వే అత్యంత రహస్యంగా సాగుతోంది. ఈ సర్వే బాధ్యతలన్నీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.