బిట్టు ఐదో తరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్ వస్తూంటాడు. దానివల్ల కొన్ని రోజులకు తన కంటే ఎవ్వరూ బాగా చదవలేరు అనే భావన బిట్టుకి గర్వం పెరిగేలా చేసింది. కష్టపడి చదివే తత్వం స్థానంలో మెల్ల మెల్లగా అహంభావం చోటుచేసుకుంది. అదే తరగతికి కొత్తగా వచ్చాడు నాని. చాలా మంచివాడు. ఎవరిని బాధ పెట్టడం నానీకి ఇష్టముండదు. కానీ నానికి కోపం ఎక్కువ. ఎవరైనా ఏమైనా అంటే వాళ్లతో మాట్లాడడు, వాళ్లని పట్టించుకోడు. ఎప్పుడూ పాఠాలన్నీ ఆచరణాత్మకంగా అనుసరించడం నానీకి ఇష్టం. అయితే పరీక్షలు రాయటం మాత్రం నచ్చదు. అందుకే ఎప్పుడూ చాలీచాలని మార్కులతో పాస్ అవుతూ ఉంటాడు. అది గ్రహించిన బిట్టు, నానీని వెక్కిరించడం మొదలుపెట్టాడు. దీంతో నానీ బిట్టుతో మాట్లాడటం మానేశాడు. అయినా ఆగకుండా ఓ రోజు తరగతి గదిలో కూర్చుని చదువుతున్న నానీని చూసిన బిట్టు తన స్నేహితులతో 'అరేరు ఎంత చదివినా నాలా ఫస్ట్ ర్యాంకు ఎప్పటికీ కొట్టలేడని తెలియక తెగ చదివేస్తున్నాడు మొద్దుగాడు' అన్నాడు. అది విన్న బిట్టు స్నేహితులు పకపకా నవ్వసాగారు. నానీ పట్టించుకోకపోవటం చూసిన బిట్టు నానీని ఇంకా రెచ్చగొట్టే మాటలన్నాడు. అప్పటిదాకా తనను తాను నియంత్రించుకున్న నానీ ఒక్కసారిగా కోపంతో పళ్లు కొరుకుతూ బిట్టూని కొట్టడానికి వెళ్లాడు. అది చూసిన బిట్టు పరుగులు తీశాడు. అయినా నానీ వదలకుండా బిట్టూని వెంబడించాడు. దీంతో బిట్టు స్నేహితులు వాళ్ల మాస్టారుతో జరిగింది చెప్పారు. బిట్టూని వెంబడిస్తున్న నానీ కాలికి ముల్లు గుచ్చుకోవడంతో పరుగు ఆపాడు. ఈలోగా బిట్టు తప్పించుకున్నాడు. కింద కూచుని ముల్లు గుచ్చుకున్న కాలిని చూసుకుంటున్న నానీని దగ్గరకు తీసుకుని, మాస్టారు 'అసలు ఏం జరిగింది?' అని అడిగారు. బిట్టు తనకి చదువు రాదు అంటూ చాలా రోజుల నుంచి వెక్కిరిస్తున్నాడని, తనకు కోపం వచ్చి బిట్టుని కొట్టడానికి వెంబడిస్తున్నప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుందని మాస్టారుతో చెప్పాడు నాని. అంతేకాకుండా తన కాలికి ఉన్న ముల్లు తీశాక, బిట్టు ఎక్కడ ఉన్నా వేతికి పట్టుకుని కసిగా కొడతానని చెప్పాడు నాని. అది విన్న మాస్టారు 'ఏది? ముందు నీ కాలికి ఉన్న ముల్లు బయటకు తీద్దాం అంటూ ముల్లు బయటకు తీసే ప్రయత్నం చేశారు.'
పక్కనే ఉన్న ఓ పూల మొక్క నుంచి ఓ పువ్వు తెంపి, నాని కాలికి ఉన్న ముల్లుని తియ్యటానికి వింతగా ప్రయత్నించారు. అది గమనించిన నాని 'అదేంటి సార్! ముల్లును పువ్వుతో తీయటానికి ప్రయత్నిస్తున్నారు. ముల్లును ముల్లుతో తీస్తేనే వస్తుందని మా నాన్నమ్మ చెప్పింది' అన్నాడు నాని.
మాస్టారు వెంటనే ఆ పువ్వు కాడకు ఉన్న ఓ ముల్లును తెంపి, దాంతో నాని కాలికి ఉన్న ముల్లును తీసి నవ్వుతూ ఇలా అన్నారు 'నానీ! అంటే నీ కాలికి గుచ్చుకున్న ముల్లును నేను పువ్వుతో తియ్యాలనుకోవటం ఎంత మూర్ఖత్వమో అలానే బిట్టు నీకు చదువురాదని వెక్కిరిస్తున్నాడన్న కోపంతో బిట్టుని కొడితే వెక్కిరించడం మానేస్తాడు అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. ఈ రోజు బిట్టుని నువ్వు కసితీరా కొట్టేస్తే, నీ కోపం తగ్గిపోవచ్చేమో కానీ మున్ముందు బిట్టు వెక్కిరింతలు ఎక్కువవుతాయి. అందుకని కొట్టడం కాకుండా వేరే మార్గం ఆలోచించి, వాడినోరు మూయించాలి!' అన్నారు మాష్టారు.
'అయితే నేను ఏం చెయ్యాలి మాస్టారు?' అంటూ అమాయకంగా అడిగాడు నాని.
అప్పుడు మాస్టారు ఇలా అన్నారు 'ముల్లును ముల్లుతోనే తియ్యాలి అన్నట్లే నువ్వు పట్టుదలతో, ఇష్టంతో చదివి, అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి' అన్నారు.
అది విన్న నాని 'అలాగే మాస్టారు. ఇక నుంచి బాగా చదివి అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను' అని ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నానిలో కొత్త ఉత్సాహం కనిపించింది. కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. అలానే తరగతిలో ఫస్ట్ వచ్చాడు. అది చూసిన బిట్టు తన అహంకారం విడిచి, తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు.
ఆదిత్య పట్నాయక్
89844 33779