న్యూఢిల్లీ : ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. 'ఈ అంశంపై రైల్వే భద్రతా విభాగం కమిషనర్ దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నివేదిక వస్తుంది. అయితే, ప్రమాదానికి మూల కారణం ఏమిటో గుర్తించాం. బాధ్యులు ఎవరో కూడా గుర్తించాం. ప్రస్తుతం రైల్వే పట్టాల పునరుద్ధరణపై దష్టిపెడుతున్నాం' అని ఎఎన్‌ఐ వార్తా సంస్థతో ఆయన చెప్పారు. దీంతో అసలు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? దీని వల్ల ప్రమాదం ఎలా జరిగింది? అన్న ప్రశ్నలు వినిపించాయి. రైల్వే రంగ నిపుణుల ప్రకారం..ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ రైల్వే సిగలింగ్ వ్యవస్థలో అత్యంత కీలకపాత్ర పోషించే సాంకేతిక అంశాల్లో ఒకటి.
- రైళ్లు ఒకదానితో మరొకటి ఢకొీట్టుకోకుండా సురక్షితంగా వెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది.
- ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ రైళ్లకు ఒకే పట్టాలపై వెళ్లకుండా ఇది చూస్తుంది.
- ఒక రైలు సిగల్ మరో రైలు సిగల్‌తో విభేదించకుండా ఆ మార్గంలోని అన్ని రైళ్లూ సమన్వయంతో ముందుకు వెళ్లేలా ఇది చూస్తుంది. ఆ రైలు మార్గం సురక్షితంగా ఉందని లేదా ఆ మార్గంపై వేరే ఏ రైలూ లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఇది సిగల్ ఇస్తుంది.
- ఇఐ టెక్నాలజీతో రైళ్లు ఒకదానితో మరొకటి ఢకొీట్టుకోవడం వంటి ఘటనలే కాకుండా ఇతర రైలు ప్రమాదాలను కూడా చాలావరకు తగ్గుతాయి. మొత్తంగా రైల్వే ఆపరేషన్లలో భద్రత కూడా పెరుగుతుంది.
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పని చేసేదిలా..!
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్, కంప్యూటర్స్ ఉంటాయి. ఇవి నిత్యం రైళ్ల కదలికలను ఒక కంట కనిపెడుతుంటాయి. ఒకప్పుడు రైళ్లు సమన్వయంతో ముందుకు వెళ్లేలా చూసేందుకు సిబ్బందే నేరుగా రాడ్లు, లివర్లతో పనిచేసేవారు. ఒక రైలును దారి మళ్లించేందుకు ఈ రాడ్లను, లివర్లను చేతులతో నొక్కేవారు. అయితే, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో చాలావరకు నిర్ణయాలన్నీ సాఫ్ట్‌వేర్‌పైనే జరుగుతాయి. దీని కోసం సెన్సర్లు, ఫీడ్‌బ్యాక్ డివైజ్‌లను వాడతారు. ఫలితంగా నిర్దేశిత సమయంలో రైలు ఎక్కడుందో పక్కాగా తెలుసుకోవచ్చు. సిగల్, ట్రాక్ సర్క్యూట్‌లు, ఇతర డేటా పాయింట్ల నుంచి కూడా ఈ సిస్టమ్‌కు సమాచారం అందుతుంది.
ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్ వెల్లడించారు. అయితే, ఈ టెక్నాలజీలో ఏ విభాగంలో సమస్య తలెత్తిందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా కీలకమే
ఇంటర్ లాకింగ్ వ్యవస్థతతో పాటు యాక్సెల్ కౌంటర్స్, ఆటోమేటిక్ బ్లాక్ సిగలింగ్ వ్యవస్థలను కూడా రైల్వే శాఖ ఉపయోగిస్తుంది. యాక్సెల్ కౌంటర్స్ (ఎసి) టెక్నాలజీ ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా పనిచేస్తుంది. పట్టాలపై ఏదైనా ట్రైన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగలింగ్ (ఎబిసి) టెక్నాలజీ పట్టాలను భిన్న బ్లాక్‌లుగా విడగొడుతుంది. ఇక్కడ ఒక బ్లాకులో ఒక రైలు మాత్రమే ఉండాలి. దీనికి అనుగుణంగానే సిగ్నిల్స్‌ను ఇస్తుంటారు. మానవ తప్పిదాలను, మానవ ప్రమేయాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు ఈ టెక్నాలజీలు పనిచేస్తాయి.










