Apr 16,2023 06:49
  • కాకినాడ, ఏలూరులో ప్రారంభం కాని రబీ ధాన్యం సేకరణ
  • ప్రయివేట్‌ వ్యాపారులకు తెగనమ్ముకుంటున్న రైతులు

ప్రజాశక్తి- కాకినాడ, ఏలూరు ప్రతినిధులు : ధాన్యం రైతులకు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కాకినాడ, ఏలూరు జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయినా, ప్రభుత్వం ఈ రెండు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. దీంతో, ఖరీఫ్‌లో మాదిరిగానే రబీలోనూ రైతులు దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. మద్దతు ధర రాక నష్టపోతున్నారు. కాకినాడ జిల్లాలో 12 రోజుల నుంచి రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా కోతలు మొత్తం పూర్తి కానున్నాయి. ఈ జిల్లాలో రబీ సీజన్లో 2.16 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. సుమారు 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గండేపల్లి మండలంలో 15 రోజుల క్రితమే కోతలు పూర్తి కాగా, యు.కొత్తపల్లి, ఏలేశ్వరం, పెదపూడి మండలాల్లో 50 శాతం, గొల్లప్రోలు, సామర్లకోట, కాజులూరు, ప్రత్తిపాడు, పిఠాపురం తదితర మండలాల్లో 35 శాతం పూర్తయ్యాయి. ఈ నెల 11న కరపలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.

  • సేకరణ లక్ష్యంపై స్పష్టత కరువు

కాకినాడ జిల్లాలో గతేడాది రబీ సీజన్లో 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. సుమారు 1,00,452 మెట్రిక్‌ టన్నులు స్థానిక అవసరాలకుపోగా 5,48,498 మెట్రిక్‌ టన్నులు సేకరించాలని అధికారుల లక్ష్యం పెట్టుకున్నారు. 311 ఆర్‌బికెల ద్వారా 2,59,708 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. ఈసారి 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 215 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. అయితే, ఎంతసేకరించాలి, ఎప్పటి వరకూ కొనుగోలు చేయాలనేది అధికారులు ఇంకా తేల్చలేదు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, పూర్తి స్థాయిలో కొనాలని రైతులు కోరుతున్నారు.

  • 'పశ్చిమ', ఏలూరు జిల్లాల్లో సంచుల కొరత

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రబీలో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఈ జిల్లాల్లో కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్‌ టన్నులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఏలూరు జిల్లాలో రెండు లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 6.47 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రబీలో ఎకరాకు 50 నుంచి 60 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఎకరాకు 40 కిలోల సంచులు వంద అవసరం అవుతాయి. ప్రభుత్వం మాత్రం 75 సంచుల నిబంధన విధించింది. అవసరం మేరకు సంచులు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖాధికారులు ఇప్పటికే నివేదించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ధాన్యం సరఫరాకు లారీల కొరత కూడా తీవ్రంగా ఉంది. ధాన్యం సంచులు ఇంకా మిల్లర్ల వద్దే ఉన్నాయి. రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె)లకు చేరలేదు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించామని, ఏలూరు జిల్లాలో ఆదివారం నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నామని అధికారులు చెప్తున్నారు.

వ్యాపారులకు అమ్మేసుకున్నాం.. : కౌలు రైతు, గండేపల్లి, కాకినాడ జిల్లా
16 ఎకరాలను కౌలుకు సాగు చేశాను. ఎకరాకు 30 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చింది. నెల రోజుల క్రితమే కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రయివేటు వ్యాపారులకు ధాన్యాన్ని తక్కువ దరకు అమ్ముకోవాల్సి వచ్చింది. వెంపాటి రాజు,