ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) : హిందూపురం పుర పాలక సంఘంలోని మురికివాడల అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. మంగళవారం పురపాలక సంఘంలోని 32వ వార్డు లోని అహ్మద్ నగర్‌లో రూ.41.5 లక్షలతో పెద్ద కాలువకు రక్షణ గోడ నిర్మాణం, నూతన సీసీ రోడ్డు నిర్మాణనికి భూమిపూజ చేసి, పనులను ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ , మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ జబివుల్లా, కౌన్సిలర్ రేష్మా బాబు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ హిందూ పురపాలక సంఘంలో మురికి వాడల అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు అభివద్ధికి సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హిందూపురం పురపాలక సంఘాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్నారు. అయితే మురికి వాడల్లో ఒక్క రోడ్డు, మురికి కాలువలు సైతం నిర్మాణం చేయలేదన్నారు. ఈ అభివద్ధి ఎక్కడ చేశారో గత పాలకులకే తెలియాలన్నారు. అహ్మద్ నగర్‌కు ఆనుకుని నీటిపారుదల శాఖకు చెందిన పెద్ద కాలువ ఉందని, దీని నుంచి ఆ ప్రాంత రక్షణ కోసం పురపాలక సంఘ సాధారణ నిధుల నుంచి రూ. 21.5 లక్షలతో రక్షణ గోడ నిర్మాణం, సచివాలయాలకు కేటాయించిన నిధులలో రూ. 20 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇదే విధంగానే పురపాలక సంఘంలో 43 సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విడుదల అయిన నిదులతో పాటు ప్రత్యేక నిధులు తీసుకుని వచ్చి పురపాలక సంఘాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లతో పాటు వైసిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, లతీఫ్ సేట్, ఖలీల్, కిరోసిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.










