- టీమిండియా ఓటమిపై బిసిసిఐ కసరత్తు
ముంబయి: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్లో భారతజట్టు ఓటమికి ప్రధాన కారణమేమిటనే విషయమై బిసిసిఐ పలు కోణాల్లో విశ్లేషణలు మొదలుపెట్టింది. ఫైనల్‌లో భారత బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారని, టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందనే పేర్కొంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి రోజు ఆటలో తొలి సెషన్‌లో బౌలర్లు రాణించినా.. రెండు, మూడు సెషన్లలో విఫలమయ్యారని, ఆ తర్వాత రోజు అద్భుతంగా పుంజుకున్నారని తెలిపింది. కానీ భారత బ్యాటింగ్ మాత్రం అలా కాదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయితే ఇది ఇప్పటి సమస్య కాదు. గత ఐదేళ్లలో విదేశాల్లో జరిగిన టెస్టుల్లో భారత్ రాణించినట్లే కనిపించినా.. బ్యాటింగ్ మాత్రం ఫెయిలవుతూనే వచ్చింది.
గత ఐదేళ్లలో భారత జట్టు విదేశాల్లో మొత్తం 27 టెస్టులు ఆడింది. వీటిలో పదింట విజయం సాధించిన జట్టు.. 14 మ్యాచుల్లో ఓడింది. మూడు మ్యాచులు డ్రా అయ్యాయి. ఇదంతా చూస్తే భారత ప్రదర్శన మెరుగ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు విదేశాల్లో భారత్ గెలవడమే చాలా అరుదు. అలాంటిది ఈ ఐదేళ్లో పది మ్యాచులు గెలవడం అంటే మాటలు కాదు. ఈ ఐదేళ్లలో భారత్ స్కోరు 400 దాటింది కేవలం ఐదుసార్లే. మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా ఆ జట్టు ఈజీగా 400ం స్కోరు చేస్తుంది. ఈ విషయం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చాలా స్పష్టంగా కనిపించింది. కానీ భారత్ మాత్రం అలా చేయలేకపోయిందన్నమాట. మొత్తం 27 టెస్టుల్లో భారత జట్టు 50 సార్లు అయినా బ్యాటింగ్ చేసి ఉంటుంది. ఈ యాభై సార్లలో కేవలం ఐదు సార్లే 400 పరుగుల మార్కు దాటిందన్నమాట. అంటే భారత బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు విదేశాల్లో గెలవకపోయినా కూడా.. బ్యాటర్లు చాలా పట్టుదలగా ఆడేవాళ్లు. ద్రావిడ్, లక్ష్మణ్ వంటి వాళ్లు అలా పేరు సంపాదించిన వారే. అదే ప్రస్తుత జట్టును పరిశీలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ కచ్చితంగా భారత్ గెలవాల్సింది. ఎందుకంటే భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. కానీ రెండు ఇన్నింగ్సుల్లోనూ కీలకమైన ఆటగాళ్లు ఫెయిలవడంతో టీం ఓడిపోయింది. ఇలా భారత బ్యాటర్లు ఏళ్ల తరబడి విఫలం అవుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లు స్టార్లు కావడం, గతంలో మ్యాచులు గెలిపించిన వాళ్లు కావడంతో ఆయా ప్లేయర్లపై కఠిన చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో వాళ్లు అదే విధానం కొనసాగిస్తూ వచ్చారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం మొదలు పెట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ అవుటైంది తమ హాఫ్ సెంచరీలు త్వరగా పూర్తి చేసుకుందామనే తొందర్లోనే. భారత బ్యాటింగ్ ఎప్పుడూ ఎక్కువగా టాపార్డర్ మీదనే ఆధారపడుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో వాళ్లే దారుణంగా ఆడారు. శుభ్‌మన్ గిల్ (13,18), రోహిత్ శర్మ (15, 43), ఛటేశ్వర్ పుజారా (14, 27), విరాట్ కోహ్లీ (14, 49) ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. అదే సమయంలో ఆసీస్‌లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ అద్భుతంగా రాణించారు. అంటే ఈ మ్యాచ్‌లో విజేతను నిర్ణయించింది బ్యాటింగే అన్నమాట.
రాహుల్ ద్రావిడ్‌పై గవాస్కర్ ఆగ్రహం..

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. జట్టు ప్రధాన కోచ్‌గా ఉండి ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతారని మండిపడ్డాడు. టీమిండియా వైఫల్యంలో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఉందని, ఇలా మాట్లాడేందుకు సిగ్గుండాలని గవాస్కర్ ఘాటుగా విమర్శించాడు.టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని, విదేశాల్లో భారత బ్యాటర్ల యావరేజ్ తగ్గడం కొత్తేం కాదని, ఇతర జట్ల బ్యాటర్లు కూడా ఇలానే విఫలమవుతున్నారని ద్రవిడ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం గంగూలీతో మాట్లాడుతూ ద్రవిడ్ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. 'ఫైనల్ మ్యాచ్‌లో వెనుకబడ్డాం. ఐదు రోజుల పాటు మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాం. ఓవల్‌లో భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టం. బౌలింగ్ నిరాశ పరిచింది. పరుగులు ధారళంగా ఇచ్చేశాం. బ్యాటింగ్‌లో షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదు. అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా రాణించలేకపోయారు.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై గవాస్కర్ ఫైర్ అయ్యాడు. 'ఇతర దేశాల బ్యాటర్ల యావరేజ్ మనకు ఎందుకు? టీమిండియా గురించి మాట్లాడుకుంటున్నాం. విదేశాల్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఇది జట్టు ఓటమికి కారణం అవుతోంది. విదేశాల్లో బౌలర్లు సత్తా చాటినా బ్యాటర్లు మాత్రం విఫలమవుతున్నారు. భారత్‌లో చెలరేగుతున్న బ్యాటర్లు.. విదేశాల్లో మాత్రం పరుగులు చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకుంటే టీమిండియాకు తీరని నష్టం జరుగుతోంది. విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. నేను ఆడుతున్న సమయంలోనూ విమర్శలను ఎదుర్కొన్నాను. వాటిని స్వీకరించే గుణం ఉండటం చాలా ముఖ్యం. టీమిండియా తాజా ఓటమితోనైనా హెడ్ కోచ్‌తో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో మార్పు రావాలి. ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా విశ్లేషించాలి. ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి తప్పులు సరిదిద్దుకోవాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
అంపైర్ల నిర్ణయాలూ భారత్‌కు వ్యతిరేకంగానే..

డబ్ల్యుటిసి ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 444పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుతే శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్ వివాదస్పదమైంది. బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ తొలి బంతిని స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్ అందుకున్నట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్ కెటిల్‌బోరో ఔట్‌గా ప్రకటించడంతో గిల్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. అప్పటి నుంచి ఈ క్యాచ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ క్యాచ్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కామెరూన్ గ్రీన్ క్యాచ్ అందుకున్నప్పుడు బంతి నేలను తాకిందని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు. ''ప్రత్యక్షప్రసారంలో చూసినప్పుడు గ్రీన్ క్యాచ్ సరిగ్గానే అందుకున్నట్లు అనిపించింది. కానీ, మేం అన్ని రీప్లేలు చూసిన తర్వాత బంతి పూర్తిగా చేతిలోకి వచ్చిందా? లేదా అనే దానిపై నాకు స్పష్టత రాలేదు. వాస్తవానికి బంతిలో కొంతభాగం నేలను తాకినట్లు నేను భావిస్తున్నాను. బంతి నేలను తాకడానికి ముందు ఫీల్డర్‌కు బాల్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నంత వరకు అది ఔట్ అని అంపైర్ భావిస్తాడు. ఇక్కడ సరిగ్గా అదే జరిగి ఉండొచ్చు. ఈ క్యాచ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లోనే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. భారత్‌లోని ప్రతీ ఒక్కరూ ఇది నాటౌట్ అని అనుకుంటారు. ఆస్ట్రేలియా వారు ఇది ఔట్ అని భావిస్తారు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇచ్చి ఉంటే.. ఆ నిర్ణయాన్ని మార్చేందుకు ఆధారాన్ని థర్డ్ అంపైర్ కనుగొని ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే, బంతి నేలకు తాకిందనేలా తుది ఆధారం ఏదీ లేదని నేను అనుకుంటున్నా. సాఫ్ట్ సిగల్ లేకున్నా.. థర్డ్ అంపైర్ అందుకే దీన్ని ఔట్?గా ఇచ్చారని, అతను తీసుకున్న నిర్ణయం సరైనదని భావిస్తున్నా'' అని పాంటింగ్ వివరించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా అసమ్మతి వ్యక్తం చేశాడు. ఇది ఐసీసీ (%×జజ%) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కిందకు వస్తుందని గిల్‌కు జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఈ లెక్కన చూసుకుంటే గిల్‌కు 115 శాతం జరిమానా పడింది.










