- విమానంలో వచ్చినా దక్కని ఓటు
- సమయమున్నా పోలింగ్ కేంద్రానికి తాళాలు
ప్రజాశక్తి - యంత్రాంగం : పట్టభద్రుల ఎన్నికల్లో నంద్యాల జిల్లా పైడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 306 పోలింగ్ కేంద్రంలో ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలకృష్ణ దొంగ ఓటువేసిందుకు వచ్చారు. ఏజెంటు గమనించి పిఒ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనను విచారించారు. తన తమ్ముడి ఓటు వేసేందుకు వచ్చానని తెలిపారు. పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన తేజరెడ్డి అనే వ్యక్తి ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా తన ఓటు లేకపోవడంతో వెనుదిరిగారు. విశాఖలోని సాగర్‌నగర్ బూత్ నెంబర్ 289లో ఇద్దరు ఉపాధ్యాయుల ఓట్లు కనిపించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పోలింగ్ కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలింగ్ అధికారి వచ్చి గేట్లకు తాళం వేయించారు. అదే సమయంలో ఒక మహిళా ఓటరు ఓటు వేయడానికి రాగా లోపలకు అనుమతించలేదు. ఇంకా ఐదు నిమిషాలు సమయం ఉన్నా ముందుగానే గేట్లు వేశారని టిడిపికి చెందిన రాజాన నానాజీ, కూనిశెట్టి రమణ తదితరులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయినా అనుమతించకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు.
విజయనగరంలో 33 ఓట్లు గల్లంతు
విజయనగరంలోని కస్పా హైస్కూలు పోలింగ్ కేంద్రంలో 33 ఓట్లు గల్లంతయ్యాయి. బూతు నెంబరు 128 ఎలో సీరియల్ నెంబరు 1755లో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.రమేష్ చంద్ర పట్నాయక్ ఓటు ఉంది. తీరా ఆయన ఓటు వేసేందుకు కేంద్రంలోకి వెళ్లేసరికి ఓటరు జాబితాలో పేరు ఎదురుగా డిలిట్ అని స్టాంప్ వేసి ఉండడంతో ఆయనకు ఓటు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. తనకు ఛాలెంజింగ్ ఓటు అయినా ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన డెప్యూటీ కలెక్టర్ శ్రీకర్‌ను, తహశీల్దార్ బంగార్రాజును నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసి పంపించామని, సాయంత్రం లోపు ఓటు హక్కు కల్పిస్తామని వారు నమ్మ బలికారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా..చివరకు ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వి.ఆనందరావు కస్పా హైస్కూలు కేంద్రంలో ఓటు వేసేందుకు రాగా, ఆయన ఓటును ఎవరో వేయడంతో నిరాశతో ఎదురు తిరిగారు. ఇలా ఈ ఒక్క కేంద్రంలోనే 33 మంది ఓట్లు గల్లంతయ్యాయి.










