Jun 02,2023 10:21
  • పలు రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ల కుదింపు
  • జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో 3 ఎసి చైర్‌ కార్‌ కోచ్‌లకు 2 కోత

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 'భవిష్యత్తు అంతా స్పీడ్‌ రైళ్లే'... అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాడు చెప్పడంతో ప్రయాణికులంతా కొత్త రైళ్లతో స్టేషన్లు కళకళలాడుతాయని భావించి.. నేడు మోసపోయారు. కొత్త సీసాలో పాత సారా మాదిరిగానే ఇది వరకూ ఉండే రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌లను కుదించేసి కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లకు ఈ కోచ్‌లను అతికించి ఎసిలుగా మార్చడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో పలు ప్రధాన రైళ్లకు బిజెపి సర్కారు ఈ దుస్థితి పట్టించింది.
 

                                                                        నిలువు దోపిడీ ఇలా..

సౌకర్యాల పెంపు, వేగంగా కదిలే రైళ్ల పరిచయం పేరుతో కేంద్రంలోని బిజెపి సర్కారు రైలు ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసే విధానం తీసుకుంది. కొత్త రైళ్ల ప్రవేశానికి అవసరమైన కోచ్‌లు, ఇతర విభాగాలతో నిర్మాణ పనులు చేపట్టకుండా, వస్తూత్పత్తి రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా ఎసి రైళ్ల పేరుతో నడిచే రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి కొత్త మోసానికి పాల్పడుతోంది. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు గతంలో 3 ఎసి చైర్‌కార్‌ కోచ్‌లు ఉండేవి. ప్రస్తుతం ఒక ఎసి చైర్‌ కార్‌ కోచ్‌తో మాత్రమే నడుస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు అత్యంత సౌలభ్యంగా ఉండే ఈ రైలులో ఎసి చైర్‌ కార్‌ కోచ్‌ల కుదింపుపై ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. రైల్వే శాఖకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వైపు ప్రయాణికులను మళ్లించేందుకు ఈ పని చేసింది. 6 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతుండగా, దీనికంటే అరగంట ముందు వందే భారత్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతున్న సంగతి తెలిసిందే. పైగా, జన్మభూమి చైర్‌ కార్‌ ధర రూ.870లే. అదే వందే భారత్‌లో అయితే రూ.1720 చెల్లించాలి. ఇలా అత్యధిక ధరాభారాన్ని ప్రయాణికులపై మోపడం, నడిచే రైళ్ల కోచ్‌లను తెగ్గోయడం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానంగా స్పష్టమవుతోంది. 130 కిలోమీటర్ల స్పీడ్‌తో నడిచే రైళ్లను 2025 నాటికి 160 కిలోమీటర్ల స్పీడుకు పెంచే యోచనతో కేంద్రం ఉన్నట్టు పదేపదే వల్లెవేస్తోంది. ప్రయాణికులు సౌకర్యాలు, వేగాన్ని కోరుకుంటున్నారనే నెపంతో ఉన్న రైళ్లకు కోతపెట్టే విధానంతో బిజెపి సర్కారు ముందుకెళుతోంది.
 

                                                               పలు రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లకు కోత

చెన్నరు మెయిల్‌-విశాఖ నుంచి చెన్నరుకు తిరిగే రైలులో 12 స్లీపర్‌ క్లాస్‌లు, 6 ఎసి కోచ్‌లు ఉండేవి. దీంట్లో స్లీపర్‌ను ఐదుకు కుదించేశారు. ఎసి కోచ్‌లకు మాత్రం 12కి పెంచారు. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి విశాఖ నుంచి చెన్నరుకు 12 స్లీపర్‌, 6 ఎసి కోచ్‌లు ఉండేవి. దీంట్లో, స్లీపర్‌ కోచ్‌లను ఐదుకు కుదించేశారు. 12 ఎసి కోచ్‌లను పెంచి నడుపుతున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌కు తిరుగుతోంది. దీంట్లో, 14 స్లీపర్‌లు, 6 ఎసి ఉండేవి. ప్రస్తుతం స్లీపర్‌ 8కి పడిపోయాయి. 10 ఎసి పెరిగాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రోజూ భువనేశ్వర్‌ నుంచి విశాఖ మీదుగా హైదరాబాద్‌ వెళ్తుంది. దీనిలో 14 స్లీపర్‌, 4 మాత్రమే ఎసి కోచ్‌లు ఉండేవి. స్లీపర్‌ను మూడుకు కుదించేసి ఏకంగా ఎసి కోచ్‌లను 15 వరకూ పెంచారు. హౌరా - హైదరాబాద్‌ మధ్య నడిచే ఈస్ట్‌కోస్ట్‌ రైలులో 8 స్లీపర్‌, 4 ఎసి కోచ్‌లుండగా ఏడుకు స్లీపర్‌ను కుదించేసి, 9కి ఎసి కోచ్‌లు పెంచారు. భువనేశ్వర్‌ మీదుగా బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో 12 స్లీపర్‌, 4 ఎసి కోచ్‌లుండేవి. ప్రస్తుతం 6 స్లీపర్‌, 7 ఎసి కోచ్‌లతో నడుస్తోంది. గతంలో బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో 13 స్లీపర్‌, 4 ఎసి కోచ్‌లు ఉండగా నేడు స్లీపర్‌ కోచ్‌లు ఏడుకు కుదించబడి 10 ఎసి కోచ్‌లు పెరిగాయి.