ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి:ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచి క్రమేణా నీటి ప్రవాహాం పెరిగి ఉదయం 11 గంటల ప్రాంతంలో 25 వేల క్యూసెక్కులకు చేరింది. 11.30 గంటలకు ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కులు దాటిపోవడంతో అధికారులు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి ఇన్‌ఫ్లో 73,770 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 68,882 క్యూసెక్కులు ఉంది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరం నుండి నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున వంశధార నదిలో నీరు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహాం 80 వేల క్యూసెక్కులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి రావొచ్చని అధికారులు చెబుతున్నారు. వంశధార ప్రాజెక్టు సర్కిల్ ఇఇ డిఎస్ ప్రదీప్ హిరమండలం మండలం గొట్టా బ్యారేజీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఒడిశా అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కొత్తూరు, భామిని, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, పోలాకి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట మండల తహశీల్దార్లు వారి పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు.










